Registration For New MPs :దిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎంపీల రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లు జూన్ 5-14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. పేపర్ వినియోగాన్ని తగ్గించడం, ఎంపీలకు వసతులను అందించేందుకు ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఫిజికల్ ఫారంపై సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిజిటలైజ్డ్ రిజిస్ట్రేషన్ వల్ల సమయం ఆదా కానుంది.
గతంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాత పార్లమెంట్ భవనంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేవారు. ఈ దఫా రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను పార్లమెంట్ హౌస్ ఎనెక్స్‌లో ఏర్పాటు చేసింది లోక్‌సభ సెక్రటేరియట్. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించి విజేతలైన అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఈ బృందం గెలిచిన ఎంపీ కొత్తగా ఎన్నికయ్యారా లేదంటే అంతకుముందు ఎన్నికల్లో విజయం సాధించారా అని చెక్ చేస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అధికారిక నివాసాలు కేటాయించే వరకు వెస్ట్రన్ కోర్టులో వసతి కల్పించనున్నారు. కొత్త ఎంపీల వసతి ఏర్పాట్లకు అవసరమైతే రాష్ట్ర భవనాలనూ కేటాయించే అవకాశం ఉంది.