తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రిక్రూట్​మెంట్​ మధ్యలో రూల్స్ మార్చకూడదు'- ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను మధ్యలో మార్చలేమన్న సుప్రీంకోర్టు

SC
SC (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 12:48 PM IST

Updated : Nov 7, 2024, 2:41 PM IST

SC On Government Jobs Recruitment : ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలను మధ్యలో మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఉదయం కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభానికి ముందు ఒకసారి నిర్ణయించిన నిబంధనలను మధ్యలో మార్చడం సాధ్యం కాదని పేర్కొంది.

'ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి'
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంది. వివక్షకు తావులేకుండా ఉండాలని, నిబంధనలను మధ్యలో మార్చడం ద్వారా అభ్యర్థులు ఆందోళనకు గురవుతారని అభిప్రాయపడింది.

'ముందస్తుగా చెబితే రూల్స్ మార్చొచ్చు'
ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి, ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చివరకు ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ముందస్తుగానే మధ్యలో నిబంధనలు మారొచ్చని చెబితేనే, దానికి అనుగుణంగా చేయవచ్చని వెల్లడించింది. అలా కాని పక్షంలో రూల్స్‌ మార్చే అవకాశమే లేదని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని పేర్కొంది. కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్​లో జస్టిస్‌ హ్రిషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ పీఎన్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఉన్నారు.

'అలా మార్చడానికి వీల్లేదు'
"ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ మొదలైన తర్వాత ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదు. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభమై, ఖాళీల భర్తీతో ముగుస్తుంది. నియామక ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఒకసారి నియమనిబంధనలు రూపొందించుకుంటే, ఆ తర్వాత వాటిని మార్చడానికి వీలుపడదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలి" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Last Updated : Nov 7, 2024, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details