Recliner Chairs For MLAs :కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యు.టి. ఖాదర్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేల సౌకర్యార్ధం అవసరమైతే 15 రిక్లైనర్ కుర్చీలను అద్దెకు తీసుకుంటామని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తీద్దామని భావించే ఎమ్మెల్యేలు రిక్లైనర్ కుర్చీలను వాడుకోవచ్చన్నారు. అసెంబ్లీ హాలులోనే ఈ కుర్చీలను అందుబాటులో ఉంచుతామని స్పీకర్ ఖాదర్ తెలిపారు. సభకు ఎమ్మెల్యేల హాజరును పెంచాలనే ఏకైక లక్ష్యంతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సకాలంలో సభకు హాజరై, ప్రతిరోజూ సెషన్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని సూచించారు.
MLAలు లంచ్ చేసి, అసెంబ్లీలోనే నిద్రపోయేందుకు ప్రత్యేక కుర్చీలు- స్పీకర్ కీలక నిర్ణయం - RECLINER CHAIRS FOR MLAS
కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రిక్లైనర్ కుర్చీలు- భోజనం చేశాక కునుకు తీసే ఛాన్స్- స్పీకర్ యు.టి.ఖాదర్ ప్రతిపాదన

Published : Feb 25, 2025, 6:45 PM IST
"ఏడాదిలో అసెంబ్లీ సెషన్ జరిగేది కేవలం 30 రోజులే. అలాంటి దానికి కొత్త రిక్లైనర్ కుర్చీలను కొనాల్సిన అవసరం లేదు. వాటిని అద్దెకు తీసుకుని, సెషన్ ముగియగానే వెనక్కి ఇచ్చేస్తాం" అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ తెలిపారు.
ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం
ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ (విధాన సౌధ)లో ఎమ్మెల్యేలకు ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటకు వెళ్లి, తిరిగి ఆలస్యంగా అసెంబ్లీలోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 2023 జులైలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ సెషన్‌లో కూడా ప్రయోగాత్మకంగా రిక్లైనర్ కుర్చీలను వినియోగించారు. వాటిని ఎమ్మెల్యేలు వినియోగించుకుని, ఎంతో సౌకర్యంగా ఫీలయ్యామని స్పీకర్ ఖాదర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో ఆ కుర్చీలను అందుబాటులోకి తెచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. ఈ సౌకర్యం వల్ల ఎమ్మెల్యేల హాజరు, పనితీరు, ఉత్పాదకత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.