తెలంగాణ

telangana

పూరీ రత్న భాండాగారంలో అంతులేని సంపద! విష సర్పాలతో సెక్యూరిటీ!! తెరిచేది అప్పుడే - puri ratna bhandar opening

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 4:53 PM IST

Puri Ratna Bhandar Value : దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఆదివారం తెరుచుకోనుంది. 46ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటం వల్ల లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు.

Puri Ratna Bhandar Value
Puri Ratna Bhandar Value (ANI)

Puri Ratna Bhandar Value :ఒడిశా పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది. 46ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరుచుకోనుంది. జులై 14న ఆ రహస్య గదిని తెరిచి, సంపదను లెక్కించనున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి భారీ సంఖ్యలో కళ్లు చెదిరే ఇతర ఆభరణాలు ఉంటాయని అంచనా. కొన్ని ఆభరణాలు 1500 ఏళ్ల క్రితం నాటివని తెలుస్తోంది. వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను లెక్కించనందున వాటిని జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. దీంతో ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది.

1978లో రూపొందించిన జాబితా ప్రకారం

  • 12 వేల 831 భరీల బంగారం
  • 22 వేల153 భరీల వెండి
  • అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు
  • ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22 వేల153 భరీల వెండి నగలు
  • ఇతర వెండి ఉపకరణాలు

వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో దాచి
భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్‌ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌కు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ, ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారని చెప్పారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదని తెలుస్తోంది.

భారీ సర్పాలతో సెక్యూరిటీ!
భాండాగారం లోపల చీకటిగా ఉంటుంది. అందులో విషసర్పాలు ఉంటాయన్న అనుమానాలున్నాయి. కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలు జగన్నాథుడి అత్యంత విలువైన ఆభరాణలకు కాపలాగా ఉంటాయని పురాణాలు, జానపద కథలు చెబుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సెర్చ్ లైట్లు తెప్పించారు. పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. గదిలో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ASI బృందాన్ని సిద్ధంగా ఉంచారు.

70రోజుల పాటు లెక్కింపు
పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా, అప్పుడు లెక్కింపునకు 70 రోజులు పట్టిందంటే ఏ స్థాయిలో ఆభరణాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

తాళం మిస్సింగ్​- డూప్లికేట్​తో ఓపెన్​
1978లో లెక్కింపు సందర్భంగా కొన్నింటిని వదిలేయడం వల్ల లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. 2019 ఏప్రిల్‌ 6న నాటి నవీన్‌ పట్నాయక్‌ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో వెనుదిరిగారు. ఆ సమయంలో కిటీకీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీకై గోడలు పెచ్చులూడి, బీటలు వారుతున్నాయని గుర్తించింది. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్‌ తాళపుచెవి పూరీ కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్‌ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు రహస్య గది తెరిచేందుకు సిద్ధమైంది.

జగన్నాథుడికి చెందిన ఆభరణాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరమని భాండాగారాన్ని తెరిచే అంశంపై సీఎం మోహన్ చరణ మాఝి ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ తెలిపారు. తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని, తాము కేవలం పర్యవేక్షిస్తామని చెప్పారు. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ సంపదను మరోచోటుకు తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్‌ రథ్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతామని చెప్పారు. అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమన్నారు. అప్పటి వరకూ సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ, నియమ నిష్టలతో ఉంటారన్నారు.

ఎంత మంది వెళతారు?
భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు. మరో వైపు 14న రత్నభాండాగారం తెరవడానికి ఎంతమంది వెళతారు? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. భాండాగారం లోపల విషసర్పాల భయం ఉండటం సంపదపై ఆసక్తితో పాటు భయం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details