Congress on MLAs Disqualification Case : పార్టీ ఫిరాయింఫులపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కులేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని అన్నారు. ఇవాళ హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. వివిధ పార్టీల శాసస సభా పక్షాలను విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీదని, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇదే అంశంపై గతంలో భిన్నమైన తీర్పులిచ్చాయని పేర్కొన్న కడియం, గందరగోళానికి తెరదించి రాజ్యాంగ ధర్మాసనం పూర్తిగా సమీక్షించి తీర్పునిస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించినట్లవుతుందన్నదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుపై తొందర పడక్కరలేదని ఇంకా డివిజన్ బెంచ్ ఉందని, అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించి తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
'పార్టీ ఫిరాయింఫులపై హైకోర్టు ఇచ్చిన పూర్తి తీర్పు అందిన తర్వాత దానిపై అధ్యయనం చేస్తాం. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. ప్రధానంగా ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి డివిజన్ బెంచ్‌కు పోయే అవకాశం ఉంటే దానిని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. నాలుగు వారాల సమయం ఉంది. సుప్రీం కోర్టు పార్టీ ఫిరాయింఫులపై భిన్నమైన తీర్పులిచ్చింది. తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ఒక రకంగా ఇవాళ మరో రకంగా తీర్పు ఇచ్చింది'- కడియం శ్రీహరి, ఘన్పూర్ ఎమ్మెల్యే
Addanki Dayakar on MLAs Disqualification Case : మరోవైపు హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆ మార్గదర్శికాలను కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ప్రస్తుతం దుస్థితి నెలకొందన్న అద్దంకి దయాకర్, గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతోందని పేర్కొన్నారు. మాజీమంత్రులు హరీశ్‌రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు బీఆర్ఎస్‌ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పునకు కారణమని విమర్శించారు.