Ramoji Film City Stall In Chennai : తమిళనాడు చెన్నైలో ట్రావెల్ అండ్ టూరిజం నిర్వహించిన 24వ ఫెయిర్‌లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్ సందడి చేసింది. టూరిజం విభాగంలో రామోజీ ఫిల్మ్ సిటీ అందిస్తున్న వివిధ రకాల టూర్ ప్యాకేజీల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకునేందుకు ఫెయిర్‌కు వచ్చిన సందర్శకులు పోటీ పడ్డారు. జీవితంలో ఒక్కసారైనా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి టూరిస్ట్ స్పాట్‌ను సందర్శించాలంటూ తమ ఆసక్తిని కనబరిచారు.
చెన్నైలోని నందంబాక్కంలో జరిగిన ఈ టూరిజం ఫెయిర్‌లో బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్ సహా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. స్టాల్స్‌లో నియమించిన సిబ్బంది తమ రాష్ట్రం అందిస్తున్న టూరిజం ప్యాకేజీల గురించి ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకులకు వివరించింది.
3 దేశాలు- 16 రాష్ట్రాలు
ఈ కార్యక్రమంలో ప్రైవేటు హోటళ్లు, టూరిజం ఆపరేటర్లు కూడా తమ స్టాల్స్ గురించి పర్యటకులకు వివరించారు. నేపాల్, థాయ్‌లాండ్ వంటి దేశాలు కూడా తమ టూరిజం ప్యాకేజీల గురించి విజిటర్స్‌కు తెలియజేశాయి. భారత పర్యటక శాఖ కూడా ప్రత్యేకంగా ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి తాము అందిస్తున్న సేవల గురించి విజిటర్స్‌కు క్లుప్తంగా వివరించింది. మొత్తంగా 3 దేశాలతో పాటు దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 160 టూరిజం స్టాల్స్ ఇక్కడ ఏర్పాటయ్యాయి. కాగా, ఈ ప్రదర్శనను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీజనల్ ట్రావెల్ ట్రేడ్ ఫెయిర్‌గా పేర్కొంటున్నారు నిర్వాహకులు.