Ramadan Delicious Dishes :ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అయింది. మార్చి 11న (సోమవారం) సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు(రోజా) చేపట్టారు. నెలరోజుల పాటు ఈ పవిత్రమైన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ తర్వాత ఈద్-ఉల్-ఫితర్(రంజాన్)ను ఘనంగా జరుపుకుంటారు.
ఇక రంజాన్ మాసం(Ramadan 2024)అంటే..నోరూరించే హాలీమ్ గుర్తొస్తుంది. అలా రోడ్డుపై వెళ్తుంటే.. హాలీమ్ ఘుమఘుమలతో ఆహార ప్రియులు ఉక్కిరిబిక్కిరవుతారు. అయితే రంజాన్ అంటే హాలీమ్ ఒక్కటే కాదు. దీనితో పాటు తప్పక రుచి చూడాల్సిన మరికొన్ని స్పెషల్ ఫుడ్స్ ఉన్నాయి. ఇంతకీ, రంజాన్ నెలలో తినాల్సిన ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిహారి - కుల్చా :మీరు రంజాన్ మాసంలో హాలీమ్తో పాటు తప్పక తినాల్సిన ఫుడ్ ఐటమ్ నిహారి. హైదరాబాదీలు ఈ మాసంలో దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ నిహారిని బీఫ్, మటన్, చికెన్‌ను ఎక్కువ సేపు ఉడికించి తయారుచేస్తారు. సాధారణంగా దీనిని కుల్చా లేదా రోటీతో కలిపి తింటారు. దీని టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇరానీ హోటళ్లలో లభిస్తుంది.
పత్తర్ కా గోష్ట్ : ఇది కూడా రంజాన్ మాసంలో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్. నిప్పు మీద వెడల్పాటి రాయిపై మటన్ ముక్కలు ఉంచి దీనిని తయారు చేస్తారు. మాంసం కలర్ లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేడి చేస్తారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు యాడ్ చేయడంతో పాటు చివర్లో ఉల్లిపాయలు, చిటికెడు సున్నంతో వడ్డిస్తారు. చాలా హోటల్స్‌లో ఈ ప్రత్యేకమైన వంటకం అందుబాటులో ఉంటుంది.
హలీమ్ :ఇది పరిచయం అక్కర్లేని పేరు. రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఇది. నగరంలో ఏ వీధినా చూసినా సెంటర్లు దర్శనమిస్తాయి. దీనిని చాలా మంది రంజాన్ మాసంలో తప్పనిసరిగా టేస్ట్ చేస్తుంటారు. హాలీమ్‌ను మాంసాన్ని(మటన్, బీఫ్ లేదా చికెన్) గోధుమలు, పప్పుదినుసులు, మసాలాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి నెమ్మదిగా ఉడికించి తయారుచేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి అందిస్తారు. మీరు రంజాన్ మాసంలో అనేక ప్రదేశాలలో ఎక్కడైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయవచ్చు.