Ram Mandir Crowd Today :అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం క్యూ కట్టారు. అలా మంగళవారం మధ్యాహ్ననానికి వేలాది భక్తులు రామాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రామాలయం రోడ్లన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామమందిరం వెలుపల మరింత భద్రతను పెంచారు అధికారులు.
'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ ఆలయ గేటు దాటేందుకు ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు అధికారులు. అప్పుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని భద్రతా సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
కాగా మంగళవారం మధ్యాహ్నం వరకు అయోధ్య రామయ్యను దాదాపు రెండు లక్షలు మంది దర్శించుకున్నారని ఓ అధికారి చెప్పారు. దర్శన సమయం పూర్తయ్యే సరికి మొత్తం 5లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేసినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇంకా క్యూ లో వేచి ఉన్నారని చెప్పారు. భక్తులకు నిరంతర దర్శనం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు.
మరోవైపు, అయోధ్య రామయ్య దర్శనం పూర్తిచేసుకున్న పంజాబ్‌కు చెందిన మనీశ్ వర్మ అనే భక్తుడు ఆనందం వ్యక్తం చేశాడు. 'చాలా ఆనందంగా ఉంది. నా జీవిత లక్ష్యం నెరవేరింది. మా పూర్వీకులు అయోధ్యలో రామాలయ నిర్మాణ కోసం చాలా కష్టపడ్డారు.' అని తెలిపారు. రామ్‌లల్లా దర్శనం అయ్యిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ శర్మ తెలిపారు.