Ram Mandir Crowd Today :అయోధ్య బాలక్‌రామ్ దర్శనానికి రెండోరోజూ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే అయోధ్య ఆలయానికి చేరుకుని గంటల తరబడి క్యూలో నిల్చొని దైవ దర్శనం చేసుకున్నారు. విపరీతమైన చలిలోనూ భక్తులు రాత్రంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి దర్శనం కోసం ఎదురు చూశారు. ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఉదయం ఏడు గంటలకు ఆలయం తలుపులు తెరిచి పటిష్ఠ బందోబస్తు మధ్య భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కల్పించారు.
అయోధ్యలో భక్త జన సందోహం
బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. తొలిరోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోగా రెండో రోజు మధ్యాహ్నం కల్లా మూడు లక్షల మంది బాలక్‌రామ్ దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్‌ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం చేయిస్తున్నామని వెల్లడించారు. దర్శనం సజావుగా సాగుతోందని తెలిపారు. రద్దీ నియంత్రణ కోసం అయోధ్య ఆలయం వైపు నుంచి వెళ్లే బస్సులను నిలిపేశారు. సుల్తాన్‌పూర్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయోధ్య ఆలయ మార్గంలో బస్సులను రద్దు చేసినట్లు UPSRTC వెల్లడించింది.
రద్దీ నిర్వహణపై యూపీ సీఎం సమీక్ష
లక్షల్లో భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయోధ్యలో రద్దీ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన యోగి వీఐపీలు దర్శనానికి వస్తే ముందుగానే ఆలయ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య ధామ్‌కు తరలివస్తున్నారని వీఐపీలు, ప్రముఖులు ఎవరైనా అయోధ్యకు రావాలనుకుంటే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తెలపాలని యోగి విజ్ఞప్తి చేశారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని కోరారు.