Rajasthan Road Accident :రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఓ టెంపోను స్లీపర్ బస్సు ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ కుటుంబసభ్యులతో కలిసి బరౌలీ గ్రామానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అనంతరం టెంపోలో శనివారం రాత్రి తిరుగుప్రయాణాన్ని మొదలుపెట్టారు. సునిపుర్ గ్రామం సమీపంలోకి వీరి టెంపో రాగానే, ఎదురుగా అధిక వేగంతో వస్తున్న స్లీపర్ బస్ ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలిలో ఒక్కసారిగా కలకలం రేగింది.
జాతీయరహదారిపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు, ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్చురీలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం శవపరీక్షలు నిర్వహించనున్నారు. గాయపడిని వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.
గాయపడిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ ఏడీఎఫ్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దుర్గాప్రసాద్ మీనా, సర్కిల్ ఆఫీసర్ మహేంద్ర కుమార్ మీనా తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాలో వ్యాన్, ఆటో పరస్పరం ఢీకొనడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుల్తాన్‌పుర్-లఖ్‌నవూ జాతీయ రహదారిపై చందాపుర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి బాధితుడు ధర్మేంద్ర కుమార్ ఆటోను వ్యాన బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామని ముసాఫిర్ఖానా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వివేక్ సింగ్ తెలిపారు.