Tamil Nadu Rainfall 2024 :తమిళనాడు విల్లుపురం జిల్లాను ఫెయింజల్ తుపాను వణికించింది. ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం వల్ల కొన్ని జిల్లాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు వరద ప్రవాహం ధాటికి వాగులుగా మారాయి. ఫలితంగా విల్లుపురం మీదుగా ప్రయాణించే అన్నీ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
భయానక వరదలు
వరద ఉద్ధృతికి పలు వంతెనలు దెబ్బతిన్నాయి. తిరువణ్ణామలై జిల్లాలోని అరనిలో రహదారులు ధ్వంసమయ్యాయి. ఫెయింజల్ బీభత్సం ధాటికి కృష్ణగిరి జిల్లాలో 3 దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు కురిశాయి. భయానక వరదలు సంభవించాయి. వ్యాన్లు, బస్సులు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఉత్నంగరై నుంచి కృష్ణగిరికి, తిరువణ్ణామలైకు ప్రయాణించే రహదారిపై భారీగా వరదనీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తమిళనాడులో భారీ వర్షాలు (ETV Bharat) సహాయ సామగ్రి పంపిణీ
విల్లుపురం జిల్లాలోని తుపాను ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన ఏర్పాట్లు చేసింది. విల్లుపురంలోని వరద పరిస్థితులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమీక్షించారు. శిబిరాల్లోని బాధితులతో మాట్లాడిన సీఎం వారికి సహాయ సామగ్రిని అందించారు. ఫెయింజల్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆరెంజ్ హెచ్చరికలు జారీ
అయితే బెంగళూరు సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం వర్షాలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో బెంగళూరు సహా, హసన్, మాండ్య, రామనగర జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఉడిపి, చిక్‌మంగళూరు జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.
కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం
ఫెయింజల్ తుపాను కారణంగా కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్ష మరో 5 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాసరగాడ్, వయనాడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. పాలక్కడ్, త్రిస్సూర్, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, కొట్టాయం, అలప్పుజ, పథనంతిట్ట జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో కాసరగాడ్‌లోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు మంగళవారం సెలవు ప్రకటించారు. స్థానిక యంత్రాంగం ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. మంగళవారం నాడు ఉత్తర కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం అరేబియా సముద్రం వైపునకు కదులుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, తుపాను కారణంగా పుదుచ్చేరిలో 48 శాతం వర్షపాతం నమోదైందని సీఎం ఎన్ రంగస్వామి తెలిపారు. రేషన్ కార్డుదారులందిరీక రూ.5000 సహాయాన్నిఅందిస్తామని చెప్పారు. పుదుచ్చేరిలో 10,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, అందుకే రైతులకు హెక్టారుకు రూ.30 వేలు అందిస్తామని వెల్లడించారు. వరదల వల్ల 50 పడవలు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 10,000 సహాయాన్ని ప్రకటించినట్లు తెలిపారు.