Rain Safety Precautions :రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల రోజంతా చిరుజల్లుల నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. దీంతో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే.. వర్షం కారణంగా ఇల్లు మొదలు అన్ని ప్రాంతాలూ తడి ఉంటాయి. దీని వల్ల విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇంట్లో ఉన్నవారు కూడా కరెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. లేదంటే.. ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. కరెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
- తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు రోడ్ల పక్కన ఉండే కరెంటు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్లకూడదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. టచ్ చేస్తే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- పొలాలకు వెళ్లే వ్యవసాయదారులు.. తడిసిన చేతులతో స్టార్టర్‌లు, మోటార్లను అస్సలే ముట్టుకోకూడదు.
- విద్యుత్ లైన్‌లకు తగులుతున్న చెట్లను తాకకూడదు.
- ఒకవేళ విద్యుత్ లైన్‌లకు చెట్ల కొమ్మలు తగిలితే.. మీ ఏరియాలో విద్యుత్ లైన్‌మెన్‌కి తెలియజేయాలి.
- ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి పార్కులు, స్టేడియాలకు వెళ్లే వారు.. అక్కడ విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదు.
- చాలా మంది ఇంట్లో తడి చేతులతో స్విచ్ బోర్డ్‌ను ముట్టుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇంకా కరెంట్‌కు సంబంధించిన ఏ వస్తువులను తడి చేతులతో ఆన్ చేయకూడదు.
- అలాగే ఇంటి బయట వెలుతురు కోసం ఏర్పాటు చేసిన లైట్‌లు వర్షంలో తడవకుండా చూసుకోవాలి.
- చిన్నపిల్లలను కరెంట్‌తో నడిచే వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
- అపార్ట్ మెంట్ నుంచి సాధారణ గుడిసె వరకు.. ఎలాంటి ఇళ్లలో ఉంటున్నవారైనా సరే.. ఉతికిన బట్టలను ఇనుప తీగలపై ఎట్టి పరిస్థితుల్లో ఆరేయకూడదు. ఈ వానలకు ఎక్కడో ఒకచోట నుంచి ఇనుప తీగలకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా దుస్తులు ఆరేసి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇనుప తీగలపై దుస్తులు ఆరేయకూడదని సూచిస్తున్నారు.
- రోడ్డుమీద, నీటిలో విద్యుత్ తీగ పడి ఉంటే వాటిని తాకకూడదు. అలాగే వాటి మీదు నుంచి వాహనాలను నడపరాదు. వైర్‌లు తెగిపడితే సమీప విద్యుత్ సిబ్బందికి లేదా కంట్రోలు రూం నంబర్లకు ఫోన్ చేయాలి.
- ఇంట్లో వాటర్ హీటర్ ఉపయోగించేవారు.. నీళ్లు వేడైన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి.
- అలాగే ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు డిష్ కనెక్షన్ తీసేయాలి.
- భారీ వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్, వంటి వాటిని పూర్తిగా ఆఫ్ చేయాలి. లేకపోతే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
- వర్షం పడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో స్టే వైర్, విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడకూడదు.
- వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. అలాగే పశువులను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
- ఇంట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే మీ లైన్‌మెన్‌కి లేదా ఇతర అధికారులకు తెలియజేయాలి.
- అనుకోకుండా ఎవరికైనా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైతే.. రక్షించడానికి మెటల్ వస్తువులు, ఇనుప రాడ్లు వాడరాదు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను వాడాలి.
ఇవి కూడా చదవండి :