Rahul Gandhi On Upcoming Assembly Elections :త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారని చెప్పాయి. త్వరలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేయాలని రాహుల్‌గాంధీ, హస్తం పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఐక్యంగా ముందుకు
కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, మూడు రాష్ట్రాల స్థానిక నేతలు, జమ్ముకశ్మీర్ నేతలు వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని రాహుల్‌గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ దిశానిర్దేశం చేస్తోందని రాహుల్ అన్నారు. బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం మానుకోవాలని ఆయన కోరారు పార్టీలో అన్ని సమస్యలపై చర్చిస్తామని త్వరలో జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా మంచి అవకాశమని, ఐక్యంగా ముందుకుసాగితే సానుకూల ఫలితాలు వస్తాయని రాహుల్ అన్నారు. పార్టీలో అంతర్గత పోరుపై ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్.
మరోవైపు, ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, మరో వర్గం నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్టీ పదవులను భర్తీ చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారని, కానీ కొంతకాలం మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే కొనసాగుతారని ఖర్గే స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఏకం కావాలని మహారాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి ఆశిష్ దువా తెలిపారు.
ఝార్ఖండ్‌లోనూ అదే సమస్య!
ఝార్ఖండ్‌లోనూ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్‌ను తొలగించాలని మిత్రపక్షాల నేతలు కోరుతూనే ఉన్నారని తెలుస్తోంది. కానీ అది ఇప్పట్లో జరగకపోవచ్చని సమాచారం. జమ్మూకశ్మీర్, హరియాణాలోనూ సీనియర్ నేతల మధ్య విభేదాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. హరియాణలో కీలక నేత కిరణ్ చౌదరి ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడుతారన్న వార్తల నేపథ్యంలో హస్తం పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిస్థితుల్లో బహిరంగంగా నేతలపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విభేదాలు, పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించిన ప్రకటనలను అధిష్ఠానం దృష్టికి తేవాలని సూచించింది. అందరూ కలిసి ఐక్యంగా ఉండి కమలం పార్టీని ఓడించాలని పట్టుదలగా ఉన్నామని, 90 సీట్లలో 70 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ఏఐసీసీ హరియాణ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా ధీమా వ్యక్తం చేశారు.