Rahul Gandhi Vs Left Parties In Wayanad : కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఓ వైపు ఇండియా కూటమిలో వామపక్షాలతో కలిసి నడుస్తూనే మరోవైపు వయనాడ్‌లో వామపక్ష పార్టీలతో తలపడుతున్నారు. దీంతో వామపక్ష నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భిన్నమైన రాజకీయ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ కంచుకోట
వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీపీఐకి చెందిన జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. ఆమె సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి. వాస్తవానికి 2008 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి వయనాడ్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. కేరళ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, దివంగత ఎంఐ షానవాస్ 2009, 2014 ఎన్నికల్లో వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వయనాడ్, అమేఠీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేశారు రాహుల్ గాంధీ. ఆయన అమేఠీలో ఓడిపోగా, వయనాడ్ నుంచి గెలిచారు. అప్పట్లో వయనాడ్‌లో 4,31,770 ఓట్లతో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై రాహుల్ గాంధీ విజయఢంకా మోగించారు.
హిందీ బెల్ట్‌లో పోటీ చేయాల్సింది
ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా భర్త, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. కూటమిలోని మిత్రపక్షం అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీచేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏకమై పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలను పాటించడం ఆందోళనకరమన్నారు. ''వయనాడ్ ప్రజలు, కేరళ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేరళ ప్రజలను తేలిగ్గా తీసుకోలేం. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీని బలంగా ఢీకొనాలని భావిస్తే హిందీ బెల్ట్‌లోని ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాల్సింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి వామపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతమైన వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? నేరుగా బీజేపీతో రాహుల్ ఎందుకు తలపడటం లేదు?'' అని డి.రాజా ప్రశ్నల వర్షం కురిపించారు.