Rahul Gandhi Fires On BJP : గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన్‌కీ బాత్ గురించి మాట్లాడే ప్రధాని, కామ్ కీ బాత్(పని) గురించి ఎప్పుడు మాట్లాడతారని ప్రశ్నించారు. 25మంది వ్యాపారవేత్తల కోసం రూ.16లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నరే రాజు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన జమ్ముకశ్మీర్ వ్యక్తి కాదని, ఔట్‌సైడర్ అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కోరుకునే అభివృద్ధిని ఆయన చేయలేడని, ఇక్కడి పరిస్థితుల గురించి గవర్నర్‌కు ఏం తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను హరించిందని ధ్వజమెత్తారు. పూంఛ్ జిల్లాలోని సూరన్కొటె, శ్రీనగర్ జిల్లాలోని జైన్కొటెలో సోమవారం జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు జమ్ముకశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో 24/7 ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారు ఎక్కడి వెళ్లినా, సోదరులను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతున్నారు. ఇదీ వారి పని. వారి రాజకీయాలు ద్వేషంపై ఆధారపడి ఉంటాయి. ఒకవైపు ద్వేషాన్ని వ్యాపింపజేసే వ్యక్తులు, మరోవైపు 'మొహబ్బత్ కీ దుకాణాలను తెరిచే వారు ఉన్నారు. గతంలో మోదీకి 56 అంగుళాల ఛాతీ ఉండేది. అది ఇప్పుడు లేదు"
--రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
'అన్యాయంగా యూటీ చేశారు'
భారత్‌లో కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ) రాష్ట్రాలుగా మారాయని తెలిపారు రాహుల్. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బిహార్ నుంచి ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు అయ్యాయని అన్నారు. అయితే, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని యూటీ చేయడం జరగలేదన్నారు. కానీ మొట్టమొదటి సారి ఓ రాష్ట్ర ప్రజల హక్కులను హరించి యూటీ చేశారని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ ప్రజలు అన్యాయానికి గురయ్యారని చెప్పారు.