Rahul Gandhi Adani Issue :అధికారులకు మిలియన్ డాలర్ల కొద్దీ లంచం ఇవ్వడం, మోసానికి పాల్పడినట్లు అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెబీ చీఫ్‌పై విచారణ జరిపించాలని అన్నారు. ఈ మేరకు గురువారం దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు రాహుల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
'అదానీ అరెస్ట్ కారు'
అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. 'శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ప్రధాని మోదీ వందశాతం అదానీని రక్షిస్తున్నారు. అదానీ అవినీతి చేసి దేశ ఆస్తులు సొంతం చేసుకున్నారు. అదానీ బీజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తారనే విషయం నిరూపితమైన అంశం. గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని మేము కోరుతున్నాం. కానీ అదానీ అరెస్టు అవ్వరు. ఎందుకంటే భారత దేశ ప్రధాని మోదీ అదానీ వెనుక ఉన్నారు. ఆయన్ని రక్షిస్తున్నారు. ఎవరు నేరం చేసినా వారిని జైలులో పెడతానని నరేంద్ర మోదీ అంటారు. అదానీ నేరం చేశారని అమెరికా ఏజెన్సీ చెబుతోంది. భారత్‌లో అదానీ నేరం చేసినట్లు అమెరికా చెబుతోంది. లంచాలు ఇచ్చినట్లు, విద్యుత్‌ను ఎక్కువ ధరకు అమ్మినట్లు చెబుతోంది. కానీ ఇక్కడ ప్రధాన మంత్రి ఏమీ చేయడం లేదు. ఏమీ చేయలేరు కూడా. ఎందుకంటే ప్రధాని మోదీ గౌతమ్ అదానీ నియంత్రణలో ఉన్నారు' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.