తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ 'కారు' ఘటన- ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటన- డ్రామా అన్న మమత - రాహుల్ గాంధీ కారు ఘటన

Rahul Gandhi Car Incident : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు అద్దం పగిలిన ఘటనపై భిన్నప్రకటనలు వెలువడ్డాయి. రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ నేత అధీర్ రంజన్ చెప్పగా, కాంగ్రెస్ సోషల్​మీడియాలో మరోలా ప్రకటన ఇచ్చింది. ఇక బంగాల్ సీఎం మమత ఇదంతా ఓ డ్రామాగా అభివర్ణించారు.

Rahul Gandhi Car Incident
Rahul Gandhi Car Incident

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 6:00 PM IST

Updated : Jan 31, 2024, 7:19 PM IST

Rahul Gandhi Car Incident :భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు అద్దం పగలడంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఘటనపై కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు అధీర్ భిన్నమైన ప్రకటనలు ఇచ్చారు. ఇక బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకంగా ఈ ఘటనను డ్రామాగా అభివర్ణించారు. పగిలిన అద్దంతోనే కారు బంగాల్​లోకి ప్రవేశించిందని చెప్పారు. అసలేం జరిగిందంటే?

'దుండగులు రాళ్లు రువ్వారు!'
బిహార్‌ నుంచి బుధవారం మరోసారి బంగాల్‌లోని మాల్డాలోకి రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించింది. మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్​లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లు వేశారని ఆ పార్టీ నేత అధీర్‌ రంజన్ చౌదరి ఆరోపించారు. దీంతో కారు అద్దం ధ్వంసమైందని చెప్పారు.

ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అధీర్​ రంజన్ అన్నారు. రాహుల్​ను భయం లేని వ్యక్తిగా అభివర్ణించారు అధీర్​. ఈ చర్యకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ఆరోపించారు. మమత ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారని, అతికొద్దిమంది సిబ్బంది మాత్రమే రాహుల్ యాత్రకు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా పేర్కొన్నారు.

రాళ్ల దాడి కాదు-సెక్యూరిటీ తాళ్ల వల్లే!
అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోలా స్పందించింది. అధికారిక సోషల్​ మీడియాలో స్పందించింది. "బంగాల్​లోని మాల్డాలో రాహుల్​ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఆ సమయంలో ఓ మహిళ ఒక్కసారిగా రాహుల్ కారు ఎదుటకు వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. సెక్యూరిటీ ఉపయోగించిన తాడు వల్ల కారు అద్దం పగిలింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ప్రజలు ఆయన వెంటే ఉన్నారు. ప్రజలు ఆయనను సురక్షితంగా కాపాడుతున్నారు" అని పోస్ట్ చేసింది.

'అదంతా డ్రామా'
మరోవైపు, బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ వాహనంపై దాడి బంగాల్​లో జరగలేదని, బిహార్‌లో జరిగిందని మమత తెలిపారు. కానీ ఈ ఘటనను తాను ఖండిస్తునట్లు చెప్పారు. కిటికీ పగిలిపోయిన తర్వాతనే రాహుల్ వాహనం రాష్ట్రంలోకి ప్రవేశించిందని చెప్పారు.

"రాహుల్ గాంధీ కారుపై రాళ్లు రువ్వినట్లు నాకు తెలిసింది. వాస్తవమేంటో తెలుసుకున్నాను. బంగాల్​లో కాకుండా ఖతిహార్‌లో ఈ ఘటన జరిగిందని గుర్తించాను. పగిలిన అద్దంతోనే రాహుల్ కారు బంగాల్​లోకి ప్రవేశించింది. దాడిని నేను ఖండిస్తున్నాను. ఇది ఒక డ్రామా తప్ప మరొకటి కాదు" అని మమత తెలిపారు. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ కాంగ్రెస్​ను వీడి బీజేపీతో ఇటీవలే చేతులు కలిపిన నేపథ్యంలో, ప్రజలు రాహుల్ కారుపై దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

Last Updated : Jan 31, 2024, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details