Wolf Attacks : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలకు అవి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే తోడేళ్లు ఈ విధంగా వరుస దాడులకు పాల్పడటం అసాధారణ విషయమని 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్' చీఫ్ ఎస్పీ యాదవ్ పేర్కొన్నారు. బహుశా రేబిస్ బారినపడటం లేదా వాటికి 'కెనైన్ డిస్టెంపర్ వైరస్' సోకడమే దీనికి కారణమై ఉండొచ్చని పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.
''తోడేళ్ల వరుస దాడులు అసాధారణ విషయం. గత పదిసంవత్సరాల్లో ఈ తరహా ఘటన ఇదే మొదటిది కావచ్చు. ఆ జంతువుల్లో దేనికైనా రేబిస్ వ్యాధి సోకి ఉండొచ్చు. దాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వే చేస్తుంది. అయితే, జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణాలను గుర్తించవచ్చు. రేబిస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్‌లు కొన్నిసార్లు పులుల వంటివాటి ప్రవర్తనను మార్చగలవు. తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయి. తోడేళ్ల దాడులకు ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు'' అని ఎస్పీ యాదవ్ చెప్పారు.
ఇటీవలి కాలంలో తోడేళ్లు దాడులు చేసిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఐదింటిని బంధించారు. 'ఆపరేషన్ భేడియా' కింద మంగళవారమే ఐదో జంతువు చిక్కిన విషయం తెలిసిందే. వాటిని పట్టుకునేందుకుగాను అటవీశాఖ 165 మంది సిబ్బందిని, 18 మంది షూటర్‌లను మోహరించింది. థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్‌లను వాడుతుంది.