Firecracker Explosion In Puri: ఒడిశాలోని పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 30మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు పటాసులు పేల్చారు. ఆ నిప్పు రవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 30మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి భరించనున్నట్లు ప్రకటించారు.