తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీ కృష్ణార్జునులతో మారిన సీన్​- అడ్వాణీ కంచుకోటలో అమిత్​ షా- రికార్డు మెజారిటీ లక్ష్యం! - lok sabha elections 2024

Amit Shah Gandhinagar Lok Sabha Constituency : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఒకటి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఎల్‌కే అడ్వాణీ వంటి ఉద్దండులు ఈ స్థానం నుంచి పోటీ చేశారు. 1989లో గాంధీనగర్‌ నియోజకవర్గంలో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. 1989 తర్వాత గాంధీనగర్‌లో ఉప ఎన్నికతో కలిపి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ కమలం జెండానే ఎగిరింది. గాంధీనగర్‌లో ఘనమైన భారతీయ జనతా పార్టీ వారసత్వాన్ని కొనసాగిస్తూ, రెండోసారి గెలుపొందేందుకు అమిత్‌ షా సిద్ధమయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న షా రికార్డు మెజార్టీనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

అమిత్​ షా
అమిత్​ షా (ETV BHARAT)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 12:15 PM IST

Amit Shah Gandhinagar Lok Sabha Constituency :బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అడ్వాణీ కంచుకోటగా ఉన్న గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో రెండోసారి విజయబావుటా ఎగరేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సిద్ధమయ్యారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్ పటేల్‌పై అమిత్‌ షా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి గాంధీనగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్‌ షా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సీజే చావ్డాపై అమిత్‌ షా 5 లక్షల 57 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మొత్తం 12 లక్షల 84 వేల 90 ఓట్లు పోలవ్వగా అమిత్‌ షాకు 8 లక్షల 94 వేల 624 ఓట్లు వచ్చాయి. చావ్డాకు 3 లక్షల 37 వేల 610 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా అమిత్‌ షా సిద్ధమయ్యారు.

1989 వరకు హస్తం హవా
గాంధీనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గాంధీనగర్‌ నార్త్‌, కలోల్‌, సనంద్‌, ఘట్లోడియా వేజల్పూర్, నరన్‌పురా, సబర్మతి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2014లోనూ ఇక్కడ అన్ని స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గతంలోనూ గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం బీజేపీకు కంచుకోటగా ఉంది. 1989 వరకు ఇక్కడ హస్తం పార్టీ హవా నడిచింది. కానీ 1989లో బీజేపీ అభ్యర్థి శంకర్‌ సింఘ్ వాఘేలా ఇక్కడ కాంగ్రెస్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టారు. 1991 నుంచి బీజేపీ కృష్ణార్జునులుగా పేరుగాంచిన అడ్వాణీ-వాజ్‌పేయి శకం మొదలైంది.

అడ్వాణీ కంచుకోట
1991 ఎన్నికల్లో అడ్వాణీ ఇక్కడి నుంచి గెలిచారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 1996లోనే జరిగిన ఉప ఎన్నికల్లో విజయ్‌భాయ్‌ పటేల్‌ గెలిచారు. అనంతరం 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో అడ్వాణీ వరుసగా విజయం సాధించి సత్తా చాటారు. అడ్వాణీ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి 2019లో అడ్వాణీ ఆరోగ్య కారణాలతో దూరం జరిగారు. 2019లో అడ్వాణీ స్థానంలో బరిలోకి దిగిన అమిత్‌ షా ఘన విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లోనూ కమలం పార్టీ వైపే గాలి వీస్తున్న వేళ మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ జరుగుతోంది.

'ఇది నా అదృష్టం'
గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఏప్రిల్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేయడం తన అదృష్టమని అమిత్‌ షా వెల్లడించారు. అడ్వాణీ, అటల్‌ జీ ప్రాతినిథ్యం వహించిన స్థానం నుంచి నరేంద్ర మోదీ ఓటర్‌గా ఉన్న నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని వివరించారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తనపై అపారమైన ప్రేమను కనబరిచారన్న అమిత్‌ షా వారి రుణాన్ని తాను ఎప్పుడూ తీర్చుకోలేనని అన్నారు. 2019లో అమిత్‌ షా 69.67 శాతం ఓట్లను సాధించారు. ఈసారి అంతకంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి. మే ఏడో తేదీన మూడో దశలో గాంధీనగర్‌లో పోలింగ్‌ జరగనుంది.

సిట్ అదుపులో హెచ్​డీ రేవణ్ణ- ముందస్తు బెయిల్​ పిటిషిన్​ కొట్టేసిన కోర్టు - hasan sex scandal

'దేశంలో సంకీర్ణ ప్రభుత్వం- ఫలితాల తర్వాత అన్ని పార్టీలు ఏకం- ఇండియా కూటమి విజయం పక్కా!' - Shashi Tharoor On INDIA Alliance

ABOUT THE AUTHOR

...view details