తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల్లో పోటీ కొత్తేమో- పోరాటం కొత్త కాదు' - వయనాడ్ ప్రజలకు ప్రియాంక లేఖ

వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ లేఖ- ఎన్నికల్లో పోటీ కొత్తగానీ, పోరాటంలో కాదని వ్యాఖ్య- తనను ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి- మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్

Priyanka Letter to Wayanad people
Priyanka Letter to Wayanad people (IANS)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Priyanka Letter to Wayanad people: ప్రజాస్వామ్యం, న్యాయం, రాజ్యాంగం నిర్దేశించిన విలువల కోసం పోరాడుతున్నానని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఈ ప్రయాణం తనకు కొత్త కావొచ్చని, ప్రజల తరఫున పోరాటం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తరఫున వయనాడ్ లోక్ సభ ఉపఎన్నిక బరిలో ఉన్న ప్రియాంక అక్కడి ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు.

'నన్ను ఎంపీగా ఎన్నుకోండి'
"నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికలో నన్ను ఎంపీగా ఎన్నుకోండి. మీతో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే వయనాడ్ ప్రజల కోసం నేను చేయగలిగినదంతా చేస్తాను. ప్రజాప్రతినిధిగా నా తొలి ప్రయాణంలో వయనాడ్ ప్రజలు నా మార్గదర్శకులు, గురువులు. ప్రజాస్వామ్యం, న్యాయం, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల కోసం పోరాడుతాను."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు

'వాటిని కళ్లారా చూశాను'
కొన్ని నెలల క్రితం తాను, తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి మండక్కై, చూరల్‌మలా వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు ప్రియాంక గాంధీ. కొండచరియలు విరిగిపటం వల్ల ప్రజలు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన వారి ఆవేదనను కళ్లారా చూశానని పేర్కొన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లులు, కుటుంబాన్ని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆ సందర్భంగా చూశానని చెప్పుకొచ్చారు. ఆ చీకటి రోజుల నుంచి బయటపడి నవశక్తితో మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయకయమని కొనియాడారు. వైద్యులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, నర్సులు, గృహిణులు, ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

"వయనాడ్ ప్రజల తరఫున పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. మీ నుంచి చాలా నేర్చుకున్నా. కష్టకాలంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, అండగా నిలవాలో తెలుసుకున్నా. నా సోదరుడు రాహుల్​కి మీరు ఎంతో ప్రేమను, అభిమానాన్ని పంచారు. వయనాడ్ ప్రజల పోరాటాలను రాహుల్ గాంధీ నాకు వివరించారు. ముఖ్యంగా రైతులు, గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన ఆందోళన చెందారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజలతో కలిసి పని చేయాలని సూచించారు. మహిళల శ్రేయస్సు కోసం నా శక్తికి మించి కృషి చేస్తానని మాటిస్తున్నా." అని బహిరంగం లేఖలో ప్రియాంక గాంధీ రాసుకొచ్చారు.

23మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్
మరోవైపు, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ 23 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. జల్నా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కైలాశ్ గోరంత్యాల్​కు మళ్లీ అవకాశం దక్కింది. సావోనర్‌ స్థానం నుంచి పార్టీ నాయకుడు సునీల్‌ కేదార్‌ భార్య అనూజను పోటీలోకి దింపింది.

ముంబయిలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. గణేశ్ కుమార్ యాదవ్ సియోన్-కోలివాడ స్థానంలో పోటీకి దింపింది. చార్కోప్ నియోజకవర్గం నుంచి యశ్వంత్ సింగ్ , కండివాలి తూర్పు స్థానం నుంచి కలు బధెలియా బరిలో​కి దిగారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం ఈ రెండో లిస్ట్ రిలీజ్ అయ్యింది. తొలి జాబితాలో 48 మందితో కలిపి మొత్తం మహారాష్ట్రలో ఇప్పటివరకు 71మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

'మహావికాస్ అఘాడీదే అధికారం'
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఐక్యంగా పోటీ చేస్తోందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏఐసీసీ ఇన్ ఛార్జ్ రమేశ్ చెన్నితాల తెలిపారు. మహారాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు కలిసి పోరాడుతామని, ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details