Priyanka Gandhi Wayanad Nomination :కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్షాలో పాల్గొన్నారు ప్రియాంక.
ఉపఎన్నిక నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి మంగళవారం రాత్రే ప్రియాంక వయనాడ్ చేరుకున్నారు. ముందుగా బుధవారం ఉదయం నాయకల సమక్షంలోనే తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ తర్వాత కాల్పేట్టాలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోతో వయనాడ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. యూడీఎఫ్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్ షో అనంతరం కేడబ్ల్యూఏ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ప్రసంగించారు.
'మొదటిసారి నా కోసం ప్రచారం చేసుకుంటున్నా'
వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమని ప్రియాంక గాంధీ అన్నారు. 'తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, పార్టీ నేతల కోసం నేను 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారాలు చేశా. మీ అందరి మద్దతుతో నా కోసం నేను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. నాకు అవకాశం ఇస్తే వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. కొండచరియలు విరిగిపడినప్పుడు అందరూ ఒకరినొకరు సాయం చేసుకోవడం నేను చూశాను. మీ ధైర్యమే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. మీ కుటుంబంలో భాగం కావడం నాకు గౌరవం' అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.