PM Modi Garba Song :నవరాత్రి సందర్భంగా గుజరాతీల సంప్రదాయ నృత్యమైన 'గర్బా'పై ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన పాటను రాశారు. ఆ పాటను సోమవారం ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
''ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా, వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ 'ఆవతీ కాలయ్' అనే గర్బా పాటను రాశాను. మనందరిపై దుర్గా దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.' అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
'ఆవతీ కాలయ్' పేరుతో ప్రధాని మోదీ రాసిన గర్బా గీతాన్ని గాయని పూర్వా మంత్రి పాడారు. పూర్వా మంత్రి అద్భుతమైన గాయకురాలు అని, చాలా చక్కగా పాడారని ప్రధాని నరేంద్ర మోదీ మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
'మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణమే స్ఫూర్తి'
మరోవైపు, ఒక వ్యక్తి తన జీవితాంతం దేశ సేవ ఎలా చేస్తారని చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ రాజకీయాల్లోకి వచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
'2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సోమవారంతో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణమే, ప్రజా సేవ కోసం ఒక వ్యక్తి తన జీవిత మొత్తాన్ని ఎలా అంకితం చేయగలరనే విషయానికి ప్రతీక. ఆయన రాజకీయ ప్రయాణంలో నిరంతరం హోంమంత్రిగా తోడుగా ఉండటం నా అదృష్టం. పేదల సంక్షేమం, భద్రత, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలా పని చేయాలో ప్రధాని నరేంద్ర మోదీ చూపించారు. 23 ఏళ్లుగా నిరాటంకంగా, అలసిపోకుండా, తనను తాను పట్టించుకోకుండా దేశానికి, ప్రజల సేవకే అంకితం ఇచ్చారు' అని అమిత్ షా ఎక్స్ వేదికగా కొనియాడారు.