Pregnant Woman Gang Raped :ఎనిమిది నెలల గర్భిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధితురాలికి 70 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళపై ఓ వ్యక్తి కొన్నాళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 10 రోజుల క్రితం నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే బాధితురాలితో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో బాధితురాలి గ్రామానికి చెందిన కొందరు, నిందితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే నిందితుడి భార్యపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో ఆమె భర్త సైతం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మహిళ, ఆమె భర్తను కాపాడారు. మొరెనా జిల్లా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం గర్బిణీని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.
మరో కేసులో రాజీ గురించి మాట్లాడడానికి వచ్చిన ఆరుగురికి పైగా వ్యక్తులు తన భార్యపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారని గర్బిణీ భర్త ఆరోపించాడు. కాగా, గర్భిణీ భర్తకు వేరే మహిళకు గత 3ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తనను పెళ్లి చేసుకోమనడం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగి నిందితుడిపై కేసు పెట్టినట్లు సమాచారం.
"ఘటనాస్థలిలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అక్కడ ఒక లెటర్ స్వాధీనం చేసుకున్నాం. మహిళకు 40 శాతం గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు. రెండు వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. గర్భిణి భర్త 10 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటాం." అని మొరెనా ఏఎస్పీ అరవింద్ ఠాకుర్ తెలిపారు.