Pregnant Murdered In Uttar Pradesh : గర్భిణీ మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లో పడేశారు దుండగులు. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
ఇదీ జరిగింది
ఖేతాపుర్ ధనౌరా బైపాస్ సమీపంలో స్థానికులకు రోడ్డుపక్కన రెండు సంచులు కనిపించాయి. అనుమానం వచ్చి వాటిని చూడగా యువతి శరీర భాగాలు ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగులను పరిశీలించగా మృతురాలు గర్భవతి అని తేలింది. ఒక బ్యాగ్‌లో తల నుంచి నడుము వరకు, రెండో బ్యాగ్‌లో నడుము నుంచి పాదాల వరకు శరీర భాగాలు ఉన్నాయి. ఆమె వయసు 23 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉంటుందని గుర్తించారు.
శరీర భాగాలను అనేక ముక్కలుగా నరికి
బాధితురాలి రెండు చేతులను నిందితులు అత్యంత దారుణంగా నరికినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి నడుము కింది భాగాన్ని పదునైన ఆయుధంతో ముక్కలుగా చేసినట్లు తెలిపారు. 'బాధితురాలి మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రోడ్డు పక్కన రెండు సంచుల్లో విసిరేసినట్లుగా గుర్తించాం. యువతి ఎవరనే వివరాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేపట్టాం. నిందితుల కోసం అన్ని ప్రాంతాల్లోనూ గాలిస్తున్నాం' అని సర్కిల్ ఆఫీసర్ అంజలి కటారియా తెలిపారు.