Precautions To Keep Pets Healthy :ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని ఇంట్లోని కుటుంబ సభ్యులలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సాధారణంగా ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఉంటాయి. నిజానికి వీటిని పెంచుకోవడం వల్ల మనకు ఎప్పుడైనా మనసు బాగాలోకపోయినా, బోర్ కొట్టినా, వాటితో కాసేపు ఆడితే మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులంటున్నారు. అయితే, కొంత మంది తమ బిజీ లైఫ్ షెడ్యూల్ల వల్ల వాటి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ చూపించరు. దీనివల్ల అవి అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, పెట్స్ ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉండటానికి ఇలా చేయండి :
అనారోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించండి : పెంపుడు జంతువులకు కూడా మనుషుల్లానే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, వాటిని వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స అందించడం వల్ల అవి ఎక్కువ రోజులు జీవించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెట్స్ రెండు మూడు రోజుల నుంచి నీరసంగా ఉంటూ, ఎటువంటి ఆహారం తినకుండా ఉంటే వాటిని ఒకసారి స్థానిక పశు వైద్యుడికి చూపించి టెస్ట్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీకాలు వేయించండి : పెంపుడు జంతువులు పెరిగే కొద్ది వాటికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉండవచ్చు. అందుకే, ముందు జాగ్రత్తగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నారు.