Prajwal Revanna Case :మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారం వేకువజామున బెంగళూరు విమానాశ్రయంలో మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఐపీఎస్‌లు సుమన్ డీ పెన్నేకర్, సీమా లత్కర్ నేతృత్వంలో ప్రజ్వల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. మహిళా పోలీసులే ప్రజ్వల్‌ను జీపులో సీఐడీ కార్యాలయానికి తరలించారని పేర్కొన్నాయి.
"ప్రజ్వల్‌ను అరెస్టు చేయడానికి మహిళా పోలీసులను పంపాలని ఓ పిలుపు ఉంది. ప్రజ్వల్ తన హోదా, అధికారాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అధికారం మహిళా పోలీసులకు ఉంది. ఈ నిర్ణయంతో మహిళా అధికారులు ఎవరికీ భయపడరని బాధితులకు ఓ సందేశం వెళ్తుంది"
- సిట్ వర్గాలు
'చట్టపరంగానే అరెస్ట్ చేశాం'
ప్రజ్వల్ రేవణ్ణను చట్టపరంగానే అరెస్ట్ చేశామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ప్రజ్వల్ పై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. "ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలోని మ్యూనిచ్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఉండడం వల్ల సిట్ ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. బాధితులకు ప్రభుత్వంగా అండగా ఉంటుంది" అని పరమేశ్వర హామీ ఇచ్చారు.
పొటెన్సీ టెస్ట్ కోసం సిట్ యత్నం!
అరెస్ట్ చేసిన తర్వాత ప్రజ్వల్‌ను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రజ్వల్‌ను కోర్టులో హాజరుపరిచి, విచారణ కోసం పోలీసు కస్టడీ కోరనున్నట్లు పేర్కొన్నాయి. నిర్ణీత సమయంలో ప్రజ్వల్‌కు పొటెన్సీ టెస్ట్ నిర్వహించాలని సిట్ ఆలోచిస్తోందని వెల్లడించాయి. ప్రజ్వల్‌కు బీపీ, షుగర్, కార్డియాక్ హెల్త్ సహా పలు వైద్య పరీక్షల కోసం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు, ప్రజ్వల్‌కు కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.