తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోస్ట్ పవర్​ఫుల్ పొలిటీషియన్​గా మోదీ- ఐదో ప్లేస్​లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే

అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ- తర్వాతి స్థానాల్లో మోహన్‌ భాగవత్, అమిత్‌షా, రాహుల్‌గాంధీ- ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు

Powerful Political Leaders In India
Powerful Political Leaders In India (ANI, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 6:44 AM IST

Updated : Nov 13, 2024, 6:55 AM IST

Powerful Political Leaders In India : దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్రమోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది.

60 ఏళ్ల రికార్డును తిరగరాశారు!
"ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు" అని విశ్లేషించింది.

ప్రధానమంత్రికి కళ్లు, చెవుల్లా!
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందిన అమిత్‌షా, ఈ జాబితాలో దేశంలో మూడో శక్తిమంత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రికి కళ్లు, చెవుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం తీసుకొనే ప్రతీ నిర్ణయం ఈయన ఆమోదం తర్వాతే ముందుకెళ్తోంది. వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్‌పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్‌గాంధీ గుర్తింపు పొందారు.

ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు
దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి, జైలుకెళ్లినా 2024 ఎన్నికల్లో ఫీనిక్స్‌ పక్షిలా ఎగిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమిపార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో తెదేపాను రెండో పెద్దపార్టీగా నిలపగలిగారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు, రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు. తర్వాతి స్థానాల్లో బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్​ సీఎం మమతాబెనర్జీ తదితరులున్నారు.

Last Updated : Nov 13, 2024, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details