How To Make Village Style Polam Pachadi :నేటిరోజుల్లో ఏదైనా పచ్చడి రుబ్బుకోవాలంటే మిక్సీలు, గ్రైండర్లు వంటివి ఉన్నాయి. కానీ, గతంలో ఇలాంటివేవి అందుబాటులో ఉండేవి కాదు. కేవలం.. రోలు, రోకలి మాత్రమే అప్పటి వారికి తెలుసు. నిజానికి వాటిలో ఏదైనాపచ్చడి(Chutney) రుబ్బుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. పైగా పోషకాలు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పచ్చడి కూడా అలాంటిదే. అదే.. విలేజ్ స్టైల్ పాత కాలపు "పొలం పచ్చడి".
దీన్నే పచ్చిమిర్చి చింతపండు చట్నీ అని కూడా అంటుంటారు. ఈ పచ్చడిని మన పూర్వీకులు నూనె వాడకుండా, పొయ్యి వెలిగించకుండా ప్రిపేర్ చేసుకునేవారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు దీన్నే ఎక్కువగా చేసుకుని తినేవారు. పైగా దీనికోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో ఈ రుచికరమైన పచ్చడిని తయారుచేసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఓసారి ట్రై చేయండిలా..
కావాల్సిన పదార్థాలు :
- పచ్చిమిర్చి - 10 నుంచి 12
- ఉల్లిపాయ - 1
- జీలకర్ర - 1 టీస్పూన్
- చింతపండు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
పొలం పచ్చడి తయారీ విధానం :
- ముందుగా మనం డైలీ వాడే సన్నని పచ్చిమిర్చి కాకుండా తొక్క కాస్త మందంగా ఉండి కారం తక్కువగా ఉండే వాటిని ఎంచుకొని సన్నగా కట్ చేసుకోవాలి.
- ఒకవేళ ఎక్కువ కారం తినేవారైతే వీటిలో రెండు, మూడు సన్నని కారంగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు.
- నిమ్మకాయంత సైజ్లో చింతపండు తీసుకొని చిన్న బౌల్లో నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఐదారు ముక్కలు చేసుకోవాలి.
- ఇప్పుడు.. రోట్లో ఒక టీస్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
- తర్వాత ముందుగా నానెబట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను కొన్ని కొన్ని వేసుకుంటూ మిశ్రమాన్ని కాస్త బరకగా ఉండే విధంగా దంచుకోవాలి.
- అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా నూరుకోవాలి. పచ్చడి బరకగా ఉంటేనే తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ పంటికి తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
- ఈ విధంగా పచ్చడిని రుబ్బుకున్నాక చివర్లో కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- అంతే.. ఎంతో రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్ పాతకాలం నాటి పొలం పచ్చడి రెడీ!
- దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే.. వారెవ్వా అంటారు.
- అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది.
- రోలు, రోకలి అందుబాటులో లేనివారైతే.. మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇవీ చదవండి :
ఆంధ్రా స్టైల్ "దొండకాయ రోటి పచ్చడి" - ఇలా చేస్తే అదిరిపోద్ది - వేడి వేడి అన్నంలో కేక!
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్లా తాగేయొచ్చు!