PM Modi on Venkaiah Naidu : దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగా ఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్యనాయుడని, ఆయన జీవితం తనతో పాటు లక్షల మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. జులై 1న వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా అంటూ ప్రధాని మోదీ వ్యాసం రాశారు.
"అంకిత భావం, ఆశావాదం, దృఢ చిత్తంతో ప్రజా సేవ చేస్తున్న నాయకుడి జన్మ దినాన్ని జరుపుకోవడం అంటే పండగ లాంటిదే. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించేదాకా సాగిన ఆయన జీవితం భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా, సులువుగా అధిగమించడంలో ఆయనకుగల సామర్థ్యాన్ని మనుకు తెలుపుతుంది. తన వాగ్ధాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై ఉన్న ధృఢ వైఖరి వంటి సుగుణాలు పార్టీలకు అతీతంగా ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయి. దశాబ్దాల నుంచే మా అనుబంధం కొనసాగుతోంది. మేము కలిసి పని చేసినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయన జీవితంలోని సార్వత్రిక అంశం ఏదైనా ఉందంటే అది ప్రజలపై ప్రేమే. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి సంఘ రాజకీయాల ద్వారా ఆయనలోని ఆచరణాత్మకత, క్రియాశీలత వెలుగులోకి వచ్చాయి. వెంకయ్య నాయుడికి ఉన్న అపూర్వ ప్రతిభ, వాక్పటిమ, నిర్వహణా నైపుణ్యరీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటుంది. 'దేశమే ప్రథమం' అనే దార్శనికత నుంచి స్ఫూర్తి పొందిన ఆయన సంఘ్ పరివార్‌తో కలిసి పని చేయడానికే మొగ్గు చూపారు. ఆ విధంగా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలతో ఆయనకుగల అనుబంధం తర్వాతి కాలంలో జనసంఘ్, బీజేపీల బలోపేతానికి ఎంతగానో దోహదం చేసింది"
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎమర్జెన్సీలో చురుకైన పాత్ర
49 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ విధించినప్పుడు వెంకయ్య నాయుడు దానిని వ్యతిరేకించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాతికేళ్ల యువకుడిగా వెంకయ్య నాయుడు ముందుకు దూకారు. ఆ క్రమంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించినందుకు ప్రభుత్వం ఆయనను జైలు పాల్జేసింది. ప్రజాస్వామ్యంపై ఈ నిబద్ధత ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు రుజువైంది. మహా నేత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసిన సందర్భంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఆయన మరోసారి ముందు వరుసలో నిలిచారు. ఇలా వెంకయ్య నాయుడు ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా 1978లో ప్రజలు కాంగ్రెస్‌కు అఖండ విజయం కట్టబెట్టినా జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నుంచి యువ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటుపైన ఐదేళ్లకు (1983) ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తొలి ఎన్నికల్లోనే సునామీ తరహా ఫలితాలతో రాష్ట్రాన్ని చుట్టబెట్టినా ఆయన వరుసగా రెండోసారి అదే స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు బాటలు వేశారు' అని ప్రధాని మోదీ వ్యాసంలో తెలిపారు.
అంకిత భావమే
వెంకయ్య నాయుడి ప్రసంగం విన్న వారంతా సాధారణంగా ఆయన వాక్పటిమకు పెద్దపీట వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. 'అయితే వాక్చతురుడు మాత్రమే కాదు, కార్యధక్షుడు కూడా. యువ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన రోజుల నుంచీ సభా వ్యవహారాలను ఔపోసన పట్టిన ఆయనలో నేర్చుకునే గుణం. నియోజకవర్గ ప్రజాగళం వినిపించడంలో చూపిన అంకిత భావం ఆయనకు అపార గౌరవం తెచ్చి పెట్టాయి. ఆయన ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ తమ పార్టీలో చేర్చుకోవాలని చూశారు. కానీ, తన మాతృ సిద్ధాంతాన్ని వీడలేనంచూ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామగ్రామానా పర్యటించి ప్రజలతో మమేకమవుతూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడయ్యారు. బీజేపీ కేంద్ర నాయకత్వం 1990లలో ఆయన కృషిని గుర్తించి, 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పటి నుంచే జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మా పార్టీని అధికారంలోకి తేవడం, దేశానికి తొలి బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వం వహించేలా ప్రధాన కార్యదర్శి హోదాలో విశేష కృషి చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు' అని పేర్కొన్నారు.