PM Modi Slams Opposition Over CAA In Azamgarh Rally : భారతదేశ బలాన్ని ప్రపంచానికి చాటే విధంగా బలమైన ప్రభుత్వాన్ని నడిపే నాయకున్ని ఎన్నుకోవటానికి ఈ ఎన్నికలు ఓ అవకాశమని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చేయాలని ఇండి కూటమి కోరుకుంటోందని, జూన్ 4వ తేదీ తర్వాత కూటమి విచ్ఛిన్నం అవుతుందని జోస్యం చెప్పారు. యూపీలో బెంగాల్ తరహా తృణమూల్ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు ఓట్ జిహాద్‌కు పిలుపునిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
సీఏఏ చట్టంపై అసత్య ప్రచారం
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైందని ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ చట్టం గురించి అసత్యాలు ప్రచారం చేయటం ద్వారా దేశంలో అల్లర్లు రేపేందుకు కాంగ్రెస్, ఎస్పీ ప్రయత్నం చేసినట్లు మోదీ ఆరోపించారు. శరణార్థులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్, భదోహి, ప్రతాప్‌గఢ్, జాన్‌పుర్, మచిలీషహర్‌తోపాటు పలు ప్రచారసభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎస్పీలపై ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రెండు వేర్వేరు అయినా, వారి దుకాణం ఒక్కటే అన్నారు. అక్కడ అసత్యాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతికి పాల్పడుతుంటారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఈసారి బుజ్జగింపు రాజకీయాల డోసును మరింత పెంచాయని విమర్శించారు. యూపీలో భాజపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఎస్పీ హయాంలో కొనసాగిన గూండారాజ్‌కు ముగింపు పలికినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అల్లరిమూకలు, మాఫియా, కిడ్నాపర్లు, రౌడీ ముఠాలకు వ్యతిరేకంగా యోగీ ప్రభుత్వం స్వచ్ఛ అభియాన్ చేపట్టిందని కొనియాడారు. సెక్యులరిజం పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న బుజ్జగింపు రాజకీయాల ముసుగును తాను తొలగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.
"మీరు(ప్రతిపక్షాలు) ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు తెలుసుకున్నారు. ప్రతి పౌరుడూ తెలుసుకున్నాడు. హిందువులు, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టి సెక్యూలరిజం ముసుగు వేసుకున్నారు. మీ (కాంగ్రెస్) లోపల దాగి ఉన్న పాపం బయటపడేది కాదు. ఇక్కడ ఉన్న మోదీ మీ(కాంగ్రెస్) ముసుగు తొలగించాడు. మీరు (ప్రతిపక్షాలు) కుట్రదారులు, మతతత్వవాదులు. మీరు (కాంగ్రెస్) దేశంలో 7దశాబ్దాలపాటు మతతత్వపు మంటలు రగిలించారు. నేను స్పష్టంగా చెబుతున్నా, ఇది మోదీ గ్యారెంటీ. దేశవిదేశాలతోపాటు ఎక్కడి నుంచైనా మీకు కావాల్సినంత బలం తెచ్చుకోండి. నేను మైదానంలో ఉన్నాను. మీరూ మైదానంలో ఉన్నారు. మీరు (ప్రతిపక్షాలు) సీఏఏను రద్దు చేయలేరు."
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇండియా కూటమిపై విమర్శల జల్లు
యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ తరహా రాజకీయాలకు తెరతీశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. భదోహిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. టీఎంసీ రాజకీయం అంటే - హిందువుల హత్యలు, దళితులు, ఆదివాసీలపై వేధింపులు, మహిళలపై దౌర్జన్యాలని ఆరోపించారు. బెంగాల్‌లో అనేక మంది భాజపా నేతలు హత్యకు గురయ్యారని, టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా హిందువులను నదిలో ముంచి చంపుతానని బెదిరిస్తున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.