PM Modi on Congress :కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక అజెండా తనను తిట్టడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దేశం గురించి కూడా ఆలోచించకుండా తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో సమాజాన్ని విభజించే అంశాలనూ వ్యాప్తి చేస్తుందని అన్నారు. కుటుంబ రాజకీయమనే విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకుందని, అందుకే ఆ పార్టీ నుంచి అంతా బయటకు వెళ్తున్నారని చెప్పారు.
'నా అతిపెద్ద కులాలు అవే'
'వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతితో కూడిన కాంగ్రెస్ పాలనలో దేశం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయిందని, ప్రస్తుతం సగర్వంగా ముందుకెళ్తోందని మోదీ చెప్పుకొచ్చారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత, మహిళలు, రైతులు, పేదలను బలోపేతం చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ నాలుగు వర్గాలే తన దృష్టిలో అతిపెద్ద కులాలు అని చెప్పుకొచ్చారు.
"స్వాతంత్ర్యం తర్వాత మనకు ఇప్పుడు స్వర్ణయుగం వచ్చింది. గతంలో ఉన్న అసంతృప్తిని వదిలే సమయం మనకు పదేళ్ల క్రితం లభించింది. ఇప్పుడు భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. 2014కు ముందు దేశంలో స్కామ్‌లు, బాంబు పేలుళ్ల గురించే చర్చ వినిపించేది. తమకు, దేశానికి ఏమవుతుందో అనే ఆందోళన దేశ ప్రజల్లో ఉండేది. దూరదృష్టితో ఆలోచించకపోవడం కాంగ్రెస్‌తో వచ్చిన పెద్ద సమస్య. సానుకూలమైన విధానాలు తీసుకురావడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. భవిష్యత్ గురించి కాంగ్రెస్ ఆలోచించేది కాదు.
ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక అజెండా మోదీని వ్యతిరేకించడమే. వికసిత్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. ఎందుకంటే వాటికి మోదీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలనే విషవలయంలో చిక్కుకుంది. ఇప్పుడు అంతా కాంగ్రెస్‌ను వీడుతున్నారు. ఆ పార్టీలు ప్రస్తుతం ఒక్క కుటుంబమే కనిపిస్తోంది."