PM Modi Gets Emotional In Tamilnadu :లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ పార్టీ నేత, ఆడిటర్ వి.రమేశ్ హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేసిన కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు తన ప్రసంగాన్ని నిలిపేశారు. ఆ తర్వాత "ఆడిటర్ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన మనతో లేరు. ఆయనో గొప్ప వక్త. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ, ఆయన హత్యకు గురయ్యారు. సభాముఖంగా నేను ఆయనకు నివాళి అర్పిస్తున్నా" అని ప్రధాని మోదీ తెలిపారు.
అనంతరం కాంగ్రెస్, తమిళనాడు అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల ముంబయిలో జరిగిన ర్యాలీలో శక్తిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ సేలం సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, డీఎంకేలను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడిచేశారు. కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, కానీ అవే నాశనం అవుతాయని అందుకు పురాణాలు, ఇతిహాసాలే సాక్ష్యమన్నారు. వచ్చేనెల 19న తమిళనాడు ప్రజలు మొదట అదే పని చేయబోనున్నారని ప్రధాని మోదీ చెప్పారు. తమిళనాట 39లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగే తేదీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందూమతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా కాంగ్రెస్, డీఎంకేలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయన్నారు. పదేపదే హిందూమతాన్ని అవమానించే ఆ రెండుపార్టీలు ఇతరమతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తుచేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని తమిళనాడు ప్రజలు శిక్షిస్తారని, తాను శక్తి ఆరాధకుడినని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణేనికి రెండు ముఖాల వంటివన్నారు.
"డీఎంకే, కాంగ్రెస్‌లు ఒక నాణేనికి రెండు ముఖాల వంటివి. డీఎంకే, కాంగ్రెస్ అంటే భారీ అవినీతి, ఒకే కుటుంబ పాలన. అందువల్ల దేశంలో కాంగ్రెస్ అధికారానికి దూరం అయిందన్నారు. దేశం నేడు 5జీ సాంకేతికత దశకు చేరింది. అయితే తమిళనాడులో డీఎంకేది ప్రత్యేక 5జీ నడుస్తోంది. డీఎంకే 5జీ అంటే ఒకే కుటుంబానికి చెందిన ఐదోతరం తమిళనాడును కబ్జా చేసింది. 5జీ కుటుంబం 2జీ కుంభకోణానికి పాల్పడి ప్రపంచవ్యాప్తంగా భారత్, తమిళనాడు ప్రతిష్ఠను దిగజార్చింది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి