Vande Bharat Trains Modi :గిరిజనులు, దళితులు, పేదలు, మహిళలు, యువకుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వారికి ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలు ప్రారంభించామని అన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన ఝార్ఖండ్ కూడా ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. రాంచీలో ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఝార్ఖండ్ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఇక్కడకు వచ్చాయి. గిరిజనులు, దళితులు, పేదలు, యువత, మహిళలు అభివృద్ధికే కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాంచీ నుంచి విమానంలో టాటానగర్ రాలేకపోయాను. విమానం టేకాఫ్‌కు కుదరలేదు. టాటానగర్ చేరుకోలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు కోరుతున్నా. రైల్వే, ఇతర ప్రాజెక్టుల వల్ల తూర్పు ప్రాంతంలో పరిశ్రమలు, పర్యటకం పెరుగుతుంది. ఝార్ఖండ్ అభివృద్ధికి కేంద్రం పెట్టుబడులను పెంచింది. ఈ ఏడాది ఝార్ఖండ్‌కు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.7,000 కోట్లు కేటాయించింది. గడిచిన 10 ఏళ్ల బడ్జెట్ తో పోల్చితే ఇది 16 రెట్లు ఎక్కువ. రైల్వే నెట్‌వర్క్‌లో 100 శాతం విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాల జాబితాలో ఝార్ఖండ్ చేరింది" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
పలు మార్గాల్లో ప్రయాణించే ఆరు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. రూ.660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ కింద 32,000 మంది లబ్దిదారులకు వర్చువల్‌గా మంజూరు లేఖలను అందించారు. ఈ క్రమంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణానికి మొదటి విడతగా రూ.32 కోట్లను విడుదల చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఝార్ఖండ్‌కు 1,13,400 ఇళ్లను కేంద్రం కేటాయించింది.
బీజేపీ సభ- ఆ 9 సీట్లే లక్ష్యం
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తన ఛాపర్ టేకాఫ్ కాకపోవడం వల్ల ప్రధాని మోదీ రాంచీ విమానాశ్రయం నుంచి జంషెద్ పుర్లోని గోపాల్ మైదాన్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు. గోపాల్ మైదాన్‌లో జరగనున్న బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. కొల్హన్ ప్రాంతంలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, 2019 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఇటీవలే కొల్హన్ ప్రాంతానికి చెందిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరారు. ఆయన ఛరిష్మాతో ఈ సారి జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ భావిస్తోంది.