PM Rojgar Mela 2024 : గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం యువతకు దాదాపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని, ఇది ఒక భారీ రికార్డు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వ హయాంలో ఇలా 'మిషన్ మోడ్'లో ఉద్యోగ కల్పన జరగలేదని విమర్శించారు. దేశంలోని యువత సామర్థ్యాన్ని, ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని తెలిపారు.
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువత బలం, నాయకత్వం ద్వారానే సాధ్యమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమైతులైన 71వేల మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం అందించారు. వారికి శుభాకాంక్షలు చెబుతూ యువతను ఉద్దేశించి మాట్లాడారు.
"రోజ్‌గార్ మేళా ద్వారా మేం నిరంతరం కృషి చేస్తున్నాం. నేడు 71,000 మందికి పైగా యువత కొత్త ఉద్యోగులుగా నియమితులయ్యారు. గత 1.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను అందించింది. ఇది ఒక భారీ రికార్డు. నిజాయితీ, పారదర్శకతతో లక్షలాది మంది యువత ఉద్యోగాలు పొందుతున్నారు" అని మోదీ తెలిపారు.
"2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. మేం ఆ ప్రతిజ్ఞను విశ్వసిస్తున్నాం. ఎందుకంటే దేశంలోని ప్రతి విధానం, నిర్ణయంలో ప్రతిభావంతులైన యువత పాత్ర ఉంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా- ఇలా ప్రతి ఒక్కటి యువతను కేంద్రంగా చేసుకుని రూపొందించిన కార్యక్రమాలే" అని ప్రధాని మోదీ చెప్పారు.
జాబ్ రిక్రూట్‌మెంట్‌లో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారని పేర్కొన్న మోదీ, వారు ప్రతి రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కెరీర్‌లో ఎంతో దోహదపడిందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లల్లో మహిళలే ఎక్కువ మంది యజమానులని ఆయన వెల్లడించారు.