తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగో దశ పోలింగ్​కు అంతా రెడీ- బరిలో 1717మంది- ఓటర్లు ఎవరికి జై కొడతారో? - Lok Sabha Polls Phase 4

Phase 4 Lok Sabha Polls 2024 : సార్వత్రిక సమరం నాలుగోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నాలుగో దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Phase 4 Lok Sabha Polls 2024
Phase 4 Lok Sabha Polls 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 5:29 PM IST

Phase 4 Lok Sabha Polls 2024 :లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర్​ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలివిడతలో ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలో 11 స్థానాలు
మహారాష్ట్రలో సోమవారం పోలింగ్‌ జరిగే 11 స్థానాల బరిలో మొత్తం 298 మంది అభ్యర్థులు ఉన్నారు. కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే జల్నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. NCP-SPకి చెందిన నటుడు అమోల్ కోల్హే శిరూర్ నుంచి పోటీలో ఉన్నారు. మహారాష్ట్రలో ఈ దఫా ఎన్నికల్లో 2.28 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 23,284 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే తొలి మూడు విడతల్లో 24 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది.

నాలుగో విడత లోక్​సభ ఎన్నికలు 2024 (ETV Bharat)

భూమిహార్‌ వర్గీయుల ప్రాబల్యం
నాలుగో విడతలో భాగంగా బిహార్‌లో దర్భంగా, ఉజియార్‌పుర్, సమస్తిపుర్, బెగూసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. 55 మంది అభ్యర్థులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉండగా వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. బిహార్‌లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్‌ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెగుసరాయ్‌ను బిహార్‌ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్‌ వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. 86 శాతం హిందూ జనాభా కలిగిన బెగూసరాయ్‌ ఎన్డీయేకు కంచుకోటగా ఉంది. అందుకే గిరిరాజ్‌ సింగ్‌ ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉన్నారు. బిహార్‌లో ఎన్నికల బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిత్యానంద రాయ్. ఆయన ఉజియార్‌పుర్ నుంచి పోటీలో చేస్తున్నారు.

నాలుగో విడత లోక్​సభ ఎన్నికలు 2024 (ETV Bharat)
నాలుగో విడత లోక్​సభ ఎన్నికలు 2024 (ETV Bharat)

బంగాల్‌లో 8 స్థానాల్లో పోలింగ్
బంగాల్‌లో 8 స్థానాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ముర్షిదాబాద్‌ జిల్లాలోని బహరంపుర్‌ లోక్‌సభ స్థానం అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి 1999 నుంచి బహరంపుర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి అధీర్‌ రంజన్‌కు పోటీగా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన యూసఫ్‌ పఠాన్‌ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి 2021లోనే రిటైరయ్యారు. బహరంపుర్‌లో ఐదు సార్లు ఎంపీగా నెగ్గిన అధీర్‌ ఈసారి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, కార్మికుల వలసలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి నిర్మల్‌ చంద్ర సాహ పోటీ చేస్తున్నారు. ప్రముఖ వైద్యుడిగా ఆయనకు పేరుంది.

నాలుగో విడత లోక్​సభ ఎన్నికలు 2024 (ETV Bharat)

శత్రుఘ్నసిన్హాకు కలిసొచ్చే అంశం అదే!
బంగాల్‌లో బరిలో ఉన్న ప్రముఖుల్లో బాలీవుడ్‌లో బిహారీబాబుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరొకరు. అసన్ సోల్ నుంచి టీఎంసీ తరఫున రెండోసారి బరిలో నిలిచారు. ఇక్కడ దాదాపు 50శాతం మంది బెంగాలీయేతరులే ఉన్నారు. అందులో అత్యధికులు బిహారీలు కావటం శత్రుఘ్నసిన్హాకు కలిసి వచ్చే అంశంగా మారింది. అందుకే 2022 ఉపఎన్నికల వేళ టీఎంసీ వ్యూహాత్మకంగా ఆయనకు టికెట్‌ ఇచ్చింది. అప్పుడు విజయం సాధించిన సిన్హా మళ్లీ బరిలో దిగారు. ఆయన్ను బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తున్న బీజేపీ స్థానికంగా సర్దార్‌జీగా సుపరిచితుడైన కేంద్ర మాజీమంత్రి సురేంద్రజీత్‌సింగ్‌ అహ్లువాలియాకు టికెట్‌ ఇచ్చింది. స్థానికుడికి, స్థానికేతరుడికి మధ్య పోరుగా ఈ ఎన్నిక మారింది. ఈ దఫా బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి బీజేపీ బంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్. ఆయన బుర్ద్వాన్-దుర్గాపుర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. నాలుగో దశ పోరులో బంగాల్‌లో 1.45 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 15, 507 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు సిద్ధం చేశారు.

నాలుగో విడత లోక్​సభ ఎన్నికలు 2024 (ETV Bharat)

కన్నౌజ్‌ అభ్యర్థిగా బరిలోకి అఖిలేశ్ యాదవ్​
ఉత్తర్‌ప్రదేశ్‌లో 13 స్థానాల్లో పోలింగ్‌ జరగనుండగా మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.46కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కన్నౌజ్‌ బరిలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ-SP అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ పైనే అందరి దృష్టి నెలకొంది. తొలుత RJD అధ్యక్షుడు లాలుప్రసాద్‌ యాదవ్‌ అల్లుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను కన్నౌజ్‌ అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ తర్వాత మనసు మార్చుకుని అఖిలేశ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

2000, 2004, 2009 ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి అఖిలేష్‌ ఎంపీగా గెలుపొందారు. 2012లో సీఎం పగ్గాలు చేపట్టాక ఆయన రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా గెలుపొందారు. 2014లోనూ రెండోసారి గెలిచిన ఆమె, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. డింపుల్‌ ఈసారి మైన్‌పురి నుంచి బరిలో నిలిచారు. మరోసారి సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌కు భాజపా టికెట్‌ కేటాయించింది. ఐదేళ్ లక్రితం తన సతీమణి డింపుల్‌ను ఓడించిన సుబ్రత్‌పై బదులు తీర్చుకోవాలని అఖిలేశ్‌ బరిలో నిలిచారు. యూపీలో నాలుగో దశ ఎన్నికల బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ. ఈయన ఖేరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

మధ్యప్రదేశ్​లో 8 స్థానాలకు పోలింగ్
మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాల్లో 74 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 1.62 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18,007 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో తొలి మూడు విడతల్లో 21 చోట్ల పోలింగ్ పూర్తయ్యింది. ఈ దశలో మిగిలిన స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

నాలుగో విడతలో భాగంగా ఝార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్, ఖుూంటి, లోహర్దగ, పాలాము స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నాలుగు చోట్ల మొత్తం 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 64.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నబరంగ్‌పుర్, బెర్హంపుర్, కోరాపుట్, కలహండి లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ నిర్వహించున్నారు. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉండనుంది.

ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్​- ఇంటి నిండా మెడల్సే!! - Child Expert In Yoga

6నెలల తర్వాత బద్రీనాథుడి ఆలయం ఓపెన్​- వర్షాన్ని లెక్కచేయకుండా పోటెత్తిన భక్తులు - Char Dham Yatra 2024

ABOUT THE AUTHOR

...view details