Modi On Elections Results :గీతాభూమి (హరియాణా)లో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల విజయంగా అభివర్ణించారు. హరియాణా, జమ్మూకశ్మీర్ ఫలితాల నేపథ్యంలో దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆ సమయంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"గీతాభూమి (హరియాణా)లో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయి. హరియాణా రైతులు కాంగ్రెస్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. తాము దేశంతో, భాజపాతో ఉన్నామని నిరూపించారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి భాజపాకు అధికారాన్ని కట్టబెట్టి ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా అరుదు. అస్సాంలో అధికారంలోకి వచ్చి 13ఏళ్లు అయ్యింది. కొన్ని రాష్ట్రాల్లో 60ఏళ్ల నుంచి అధికారంలోకి రాలేదు. ఒక్కసారి కాంగ్రెస్‌ను ఓడిస్తే మళ్లీ అధికారంలోకి రానివ్వరు. నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.