Para Commandos In Jammu : జమ్ముకశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ముష్కరుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 4 వేల మంది భద్రతాదళాలు గాలింపు చర్యల్లో పాల్గొంటుండగా, తాజాగా అదనపు బలగాలను తరలించింది. హెలికాప్టర్లు, డ్రోన్లతో ముష్కరమూకల కోసం జల్లెడ పడుతున్నారు. జమ్ములో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో భారత్‌లోకి ప్రవేశించిన 50-55 మంది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆట కట్టించేందుకు 500మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలో దించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. నిఘా వర్గాలు కూడా తమ చర్యలను వేగవంతం చేసినట్టు పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు అండదండలు అందించేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పాక్ మాజీ సైనికుల హస్తం?
ఇటీవల జమ్ము, రాజౌరి, పూంచ్, రియాసి, కఠువా జిల్లాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతుండడం వల్ల భద్రతాదళాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ముష్కరులు పన్నిన గెరిల్లా యుద్ధవ్యూహాలు, వారి వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను ప్రకారం వారు సాధారణ ఉగ్రవాదులు కాదని తెలుస్తోంది. వారిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనికులు ఉండొచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో గత 32నెలల్లో జరిగిన దాడుల్లో దాదాపు 50 మంది భద్రతా సిబ్బంది సహా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 4 నెలల్లోనే ఐదు భారీ ఉగ్రదాడులు జరిగాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12మంది సైనికులు అమరులయ్యారు. మరో 10మంది సామాన్యులు చనిపోగా 55 మంది గాయపడ్డారు.