Baba Siddique Death Case : ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధిఖీ హత్యకు మూడు తుపాకులు ఉపయోగించినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు తాజాగా నిందితులు నాలుగు తుపాకులు వినియోగించినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
డ్రోన్ సాయంతో సరిహద్దుల్ని దాటించి నిందితులు వాటిని చేజిక్కించుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మరిన్ని వివరాలను సేకరించేందుకు తుపాకుల ఫొటోలను రాజస్థాన్‌కు పంపించారు. తూర్పు బాంద్రాలోని తన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీని హత్య చేశారు. అక్టోబరు 12 జరిగిన ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, హరియాణాకు చెందిన గుర్‌మైల్ బల్జీత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌తో శివ్‌కుమార్ గౌతమ్ అనే ముగ్గురు నిందితులు సిద్ధిఖీని కాల్చి చంపారు. శివ్‌కుమార్ గౌతమ్‌కు తుపాకులు వినియోగించడం వచ్చు. అతడు గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరిపిన సందర్భాలున్నాయి. అతడే ఈ కేసులో ప్రధాన షూటర్‌గా భావిస్తున్నారు. కశ్యప్, సింగ్‌కు అతడే శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.