Padma Vibhushan Venkaiah Naidu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. వెంకయ్య నాయుడుతోపాటు సులభ్ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్ పాఠక్ బదులు ఆయన సతీమణి అమోలా పాఠక్ అవార్డును స్వీకరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీమంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉథుప్ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించినవారిని పద్మశ్రీ అవార్డులతో సత్కరిస్తోంది.