MoE Board Exam Analysis :2023లో దేశవ్యాప్తంగా 65 లక్షల మందికిపైగా విద్యార్థులు 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో పాస్ కాలేదని కేంద్ర విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో సెంట్రల్ బోర్డుల కంటే స్టేట్ బోర్డుల్లోనే ఫెయిల్యూర్ రేటు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. 56 రాష్ట్ర బోర్డులు, మూడు సెంట్రల్ బోర్డుల ఫలితాలను విశ్లేషించి ఈ వివరాలను పొందుపరిచారు.
దాదాపు 33.5 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు తదుపరి గ్రేడ్‌కు చేరుకోలేదు. వీరిలో 5.5 లక్షల మంది పరీక్షలకు హాజరు కాలేదు. 12వ తరగతిలో దాదాపు 32.4 లక్షల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. వీరిలో 5.2 లక్షల మంది పరీక్షలకు హాజరుకాలేదు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ సంఖ్యలో బాలికలు పరీక్షలకు హాజరుకాగా ఆ సంఖ్య ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల నుంచి తక్కువగా ఉంది. పదో తరగతిలో విద్యార్థుల ఫెయిల్యూర్ రేట్ సెంట్రల్ బోర్డుల్లో 6 శాతం ఉండగా రాష్ట్ర బోర్డుల్లో 16 శాతంగా ఉంది.
12వ తరగతిలో ఫెయిల్యూర్ రేట్ సెంట్రల్ బోర్డుల్లో 12 శాతం ఉండగా రాష్ట్ర బోర్డుల్లో 18 శాతంగా నమోదైంది. 10వ తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయిన బోర్డుల్లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా ఆ తర్వాత బిహార్, యూపీ బోర్డులు ఉన్నాయి. ఇక 12వ తరగతిలో ఉత్తర్ ప్రదేశ్ బోర్డు నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కాగా ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2023లో విద్యార్థుల ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ క్షీణించింది. దీనికి ఎక్కువ సిలబస్ కారణం కావొచ్చని అధికారులు వెల్లడించారు
అయితే సీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్‌ఈని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని సమాచారం. ఈ పూర్తి వార్త చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.