తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వినేశ్‌ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ- జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ మండిపాటు- వాకౌట్‌ చేసిన విపక్షాలు - Rajya Sabha on Vinesh Phogat

Opposition Walkout Rajya Sabha : వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు వ్యవహారంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఫొగాట్ అనర్హతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి. ఆ తర్వాత వాకౌట్ చేశాయి. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులపై ప్రవర్తనపై రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.

Opposition Walkout Rajya Sabha
Opposition Walkout Rajya Sabha (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 12:15 PM IST

Updated : Aug 8, 2024, 1:29 PM IST

Opposition Walkout Rajya Sabha : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు రాజ్యసభను కుదిపేసింది. వినేశ్ న్యాయం జరిగేలా చూడాలంటూ విపక్ష నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అలాగే వినేష్ అనర్హతపై దారితీసిన పరిస్థితులపై చర్చకు పట్టుబట్టాయి. అందుకు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ అంగీకరించకపోవడం వల్ల విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. "ఈ విషయం గురించి ప్రతిపక్షాలు మాత్రమే బాధపడుతున్నారని భావిస్తున్నారు. అందరికీ అదే బాధ ఉంటుంది. వినేశ్ ఫొగాట్‌కు జరిగిన అన్యాయం పట్ల యావ‌త్ దేశం బాధలో ఉంది. ప్రతి ఒక్కరూ వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లే అవుతుంది" అని విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే టీఎంసీ ఎంసీ డెరెక్ ఒబ్రెయిన్ తీరును సైతం ఖండించారు. "మీరు రాజ్యసభ ఛైర్మన్‌పై అరుస్తున్నారు. ఈ ప్రవర్తనను ఖండిస్తున్నాను. అలాంటి ప్రవర్తనను ఎవరైనా భరించగలరా?" అని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాసేపు సభ నుంచి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ బయటకు వెళ్లిపోయారు.

'యావత్ భారతావని ఆమెకు అండగా ఉంది'
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యావత్ దేశం అండగా ఉందని రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రధాని వినేశ్‌ను ఛాంపియన్లకే ఛాంపియన్‌గా అభివర్ణించారని పేర్కొన్నారు. 140 కోట్ల దేశ ప్రజల భావన ఇదేనని అన్నారు. దురదృష్టవశాత్తూ ఈ అంశాన్ని సభలో విపక్షం, అధికార పక్షం అన్నట్లు విభజిస్తున్నారని ఆరోపించారు. వినేశ్ ఫొగాట్ అనర్హత వ్యవహారంలో కేంద్రం, క్రీడాశాఖ, భారత ఒలింపిక్‌ మండలి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. ప్రతిపక్షం చర్చించడానికి ఏ అంశం లేదని, ఒక వేళ ఉంటే చర్చకు అధికార పార్టీ సిద్ధమని తెలిపారు.

'వినేశ్‌కు రజతం వచ్చేలా చూసే బాధ్యత కేంద్రానిదే'
వినేశ్ ఫొగాట్ మళ్లీ తలెత్తుకుని పోరాడాలని దేశం మొత్తం ఆశగా ఉందని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా తెలిపారు. కానీ కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో మాట్లాడాలని కోరారు. చేజారిన ఆ పతకం వినేశ్‌ ఒక్కదానిదే కాదు, దేశానిదని పేర్కొన్నారు. వినేశ్‌కు రజతం వచ్చేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.

అధిక బరువు కారణంగానే
పారిస్ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల విభాగంలో భారత రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ ఫైనల్‌కు చేరింది. బుధవారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా, ఉదయం పోటీదారుల బరువును పరీక్షించారు. ఇందులో ఆమె 100 గ్రాముల అదనపు బరువు ఉండటం వల్ల అనర్హత వేటు పడింది. దీంతో పతకం చేజారింది. ఈ అంశంపై వినేశ్‌కు న్యాయం చేయాలని కోరుతూ విపక్షాలు రాజ్యసభలో పట్టుపట్టడం వల్ల గందరగోళం ఏర్పడింది.

Last Updated : Aug 8, 2024, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details