CM Nitish Kumar Go Forward To Hold The Engineer's Feet : బిహార్‌లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే ఆయన పాదాలకు నమస్కరిస్తానంటూ నితీశ్ కుమార్ ముందుకు వెళ్లారు. దీనితో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ ఛౌదరీ, విజయ్‌కుమార్‌తో పాటు స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్‌లు కూడా అదే వేదికపై ఉన్నారు.
వేగంగా ప్రాజెక్ట్ పనులు
'జేపీ గంగా పథ్' ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గయా ఘాట్ నుంచి కంగన్ ఘాట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మూడో దశ పనులను నేడు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై ఆయనకు అధికారులు వివరించారు. అయితే, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఏడాదిలోగా పనులన్నీ పూర్తిచేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు.
కాళ్లు మొక్కుతా
ఆ తరువాత అక్కడే ఉన్న నిర్మాణ సంస్థ ప్రతినిధిని ఉద్దేశిస్తూ, ఈ 'జేపీ గంగా పథ్' ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం కోరారు. అక్కడితో ఆగకుండా, 'కావాలంటే మీ పాదాలకు నమస్కరిస్తా. సకాలంలో పనులు పూర్తిచేయండి' అంటూ సదరు సంస్థ ప్రతినిధిని అభ్యర్థించారు. అంతేకాకుండా మరింత ముందుకు వెళ్లి అతడి చేతులు పట్టుకున్నారు నితీశ్ కుమార్. దీనితో కంగుతిన్న సదరు ప్రైవేటు సంస్థ ప్రతినిధి, ‘సర్, దయుంచి అలా చేయవద్దు’ అంటూ వెనక్కి వెళ్లిపోయారు. అయితే సీఎం తీరుతో ఉలిక్కిపడిన ఇతర నాయకులు, ఉన్నతాధికారులు ఒక్కసారిగా లేచి నిలబడి, ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారు.