Omar Abdullah Oath Ceremony :జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎం అయ్యారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే, సీపీఐ నేత డీ రాజా హాజరయ్యారు.
'అందుకే నూతన ప్రభుత్వంలో చేరడం లేదు'
ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా సురీంద్ర కుమార్ చౌదరీ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆరుగురు నేతలు ఎవరూ ప్రమాణస్వీకారం చేయడం లేదని జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా వెల్లడించారు. 'ప్రస్తుతానికి మేం జమ్మూకశ్మీర్‌లోని నూతన ప్రభుత్వంలో చేరడం లేదు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ బలంగా డిమాండ్ చేసింది. కానీ, అది ఇంతవరకు అది జరగలేదు. అసంతృప్తిగా ఉన్నాం. ఈ విషయంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం'అని హమీద్ పేర్కొన్నారు.
మరోవైపు చాలా కాలం తర్వాత జమ్ముకశ్మీర్‌లో స్థిరతమైన ప్రభుత్వం వచ్చినందకు సంతోషంగా ఉందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం- ప్రజల సమస్యలను, బాధలను పరిష్కరిస్తుందని తెలిపారు. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం కొత్త ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు నిరుద్యోగం, డ్రగ్స్, విద్యుత్ వంటి ప్రధాన సమస్యలను అధిగమించేందుకు మార్గాలను కనుగొంటుందని అన్నారు.