Odisha Road Accident : ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ట్రక్కు బోల్తా కొట్టి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ధర్సుని ఘాట్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిందీ దుర్ఘటన.
లోయలో బోల్తా పడిన ట్రక్కు ఇంతకీ ఏం జరిగిందంటే?
నాట్యబృందం ఉన్న ఓ ట్రక్కు రాయ్‌రంగ్‌పుర్ నుంచి జలేశ్వర్ వైపు బుధవారం ఉదయం వెళ్తోంది. ట్రక్కు ధర్సుని ఘాట్ రోడ్డు దాటుతుండగా, చివరి మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో నాట్య బృందం ఉన్న ట్రక్కు 20 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో ట్రక్కులో ఉన్న ఆరుగురు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న బంగిరిపోషి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బరిపాడులోని పీఆర్ఎం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్పించారు.
లోయలో బోల్తా పడిన ట్రక్కు కొందరి పరిస్థితి విషమం!
సౌండ్ బాక్స్‌ల మీద పడి కొందరు మరణించారని పోలీసులు తెలిపారు. వర్షం పడడం వల్ల ట్రక్కు అదుపుతప్పి బోల్తా కొట్టి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరించామని చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఇద్దరు మృతి
Crackers Factory Blast In Tamilnadu : తమిళనాడు విరుద్‌నగర్‌లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వాచకరపట్టి గ్రామంలో బుధవారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాణాసంచా పేలుడు ప్రమాదంలో ముదలిపట్టికి చెందిన వీరకుమార్, పుత్తూరుకు చెందిన కాళీరాద్ అనే ఇద్దరు కూలీలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. శరవణకుమార్, సుందరమూర్తి అనే మరో ఇద్దరు కార్మికులకు 90 శాతం కాలిన గాయాలయ్యాని చెప్పారు. వీరిద్దర్ని విరుద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని చెప్పారు.