Odisha New CM BJP : ఒడిశా ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని తేల్చేందుకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్‌యాదవ్‌ను కేంద్ర పరిశీలకులుగా భారతీయ జనతా పార్టీ నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ వెల్లడించారు. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 12న నిర్వహించనున్నట్లు అంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి దిల్లీప్ మొహంతి స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని పేర్కొన్నారు.
అంతా వాయిదా!
అయితే తొలుత జూన్ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా తాజా మార్పు జరిగిందని బీజేపీ నేతలు జతిన్ మొహంతి, విజయ్‌పాల్ సింగ్ వెల్లడించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, కేబినేట్ తొలి భేటీ కానుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కూడా జూన్ 11న జరగనుంది. ఈ క్రమంలోనే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.