Nia New Chief Sadanand Vasant Date: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నూతన అధిపతిగా మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎఫ్) చీఫ్ సదానంద్ వసంత్ దాతె నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన వసంత్ దాతె, ముంబయి 26/11 ఉగ్రదాడి ప్రధాన నిందితులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) అధిపతిగా అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్‌ను కేంద్రం నిమించింది.
ప్రస్తుతం ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న దినకర్ గుప్తా మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నియమితులైన వసంత్ దాతె 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగునున్నారు. 26/11 ఉగ్రదాడిగా పేరొందిన ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదలను అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌లను పట్టుకున్నది వసంతే. ఆ సయమంలో ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకొని ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారు.
తీవ్రగాయాలైన వెనక్కి తగ్గలేదు
ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి కాళ్లూచేతులకు తీవ్రగాయాలై, చాలారక్తం కోల్పోయి తాను స్పృహతప్పి పడిపోయేంతవరకు దాదాపు గంటసేపు ఆయన వీరిద్దరినీ ఆనాడు వదల్లేదు. గ్రనేడ్ తునకలు శరీరాన్ని చీల్చినా వెనక్కి తగ్గకుండా కాల్పులు జరుపుతూ, సీనియర్ అధికారులకు ముఖ్యమైన సమాచారం చెబుతూ ఎదురుదాడి పనిని సులభతరం చేశారు. అలానే ఎంతోమంది పౌరుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఆనాటి సాహసోపేత చర్యకు గానూ రాష్ట్రపతి పోలీసు పతకాన్ని కూడా వసంత్ అందుకున్నారు. ఉగ్రదాడుల కేసుల దర్యాప్తు నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబయి ఘటన అనంతరం ఉగ్రదాడుల నిర్మూలనకు ఎన్‌ఐఏ ఆవిర్భవించగా 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని పగ్గాలు ఆయన చేతికి దక్కాయి. అధునాతన ఆయుధాలను అలవోకగా వినియోగించగలిగే సామర్థ్యం ఉన్న వసంత్ దాతె మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. పేద కుటుంబానికి చెందిన ఆయన పుణెలో కొన్నాళ్లు దినపత్రికలు విక్రయించారు.