Modi About Indian Mindset :భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకులు తయారుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి లీడర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ (సోల్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు.
ప్రపంచ శక్తి కేంద్రంగా భారత్
ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తిసామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారుచేసే విషయంలో 'సోల్' గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తుచేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగానే గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
"అన్ని రంగాల్లోనూ భారత్‌తోపాటు యావత్ ప్రపంపంలో తనదైన ముద్ర వేయగలిగిన లీడర్లు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ నుంచి వస్తారని నాకు విశ్వాసం ఉంది. ఇక్కడ శిక్షణ తీసుకొని బయటకొచ్చిన యువకులు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించవచ్చు. ఏ దేశమైనా అభివృద్ధి సాధించింది అంటే సహజంగా అందులోని సహజవనరుల పాత్ర కీలకంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మానవవనరుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దషో షేరింగ్ తోబ్గే కూడా పాల్గొన్నారు. 'సోల్' అనేది నరేంద్ర మోదీకి వచ్చిన 'కళాత్మక ఆలోచన' అని తోబ్గే అభివర్ణించారు. భారతదేశానికి సేవ చేయడానికి అనుగుణంగా యువతను శక్తివంతం చేయడంలో మోదీకున్న అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శమని పేర్కొన్నారు. మోదీని తన 'గురువు, అన్నయ్య'గా తోబ్గే పేర్కొన్నారు. ఆయనను కలిసినప్పుడు ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి తనకు ప్రేరణ లభిస్తుందని అన్నారు.
"ప్రధాని మోదీ నా అన్నయ్య. మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చిన ప్రతిసారీ నేను ఆనందంతో ఉప్పొంగిపోతాను. మీరు నాకు గురువు. మిమ్మల్ని కలిసి ప్రతిసారీ ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి నేను ప్రేరణ పొందుతాను."
- దషో షేరింగ్ తోబ్గే, భూటాన్ ప్రధాని