తెలంగాణ

telangana

'100 రోజుల్లో రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం- 'జమిలి' అమలు తథ్యం!' - Amit shah on 100 days of NDA

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 1:44 PM IST

Amit Shah On 100 days of Modi 3.0 : వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం తొలి వంద రోజుల పాలనలో రూ.3 లక్షల కోట్లు విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంచామని తెలిపారు. ఉల్లిపాయలు, బాస్మతీ బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించామని పేర్కొన్నారు.

Amit Shah On Modi 100 Days
Amit Shah On Modi 100 Days (ANI)

Amit Shah On 100 days of Modi 3.0: బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కార్ తన తొలి 100 రోజుల పాలనలో రూ.3 లక్షల కోట్లు విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. 25 వేల మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం, మహారాష్ట్రలోని వాధవన్‌లో భారీ ఓడరేవు నిర్మాణం వంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని వెల్లడించారు. ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) పెంచామని, ఉల్లిపాయలు, బాస్మతీ బియ్యంపై కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) తొలగించామని పేర్కొన్నారు. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతి సుంకాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఎన్​డీఏ సర్కార్ ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

"దేశంలోని అనేక సంస్థలు ప్రధాని మోదీ పుట్టినరోజును 'సేవా పఖ్వాడా'గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. సెప్టెంబర్ 17- అక్టోబర్ 2 వరకు బీజేపీ కార్యకర్తలు పలు సేవాకార్యక్రమాలు చేపడతారు. మోదీ నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయ్యారు. అందుకే ఆయనకు ప్రపంచంలో 15 దేశాలు అత్యున్నత గౌరవ పురస్కారాలను ఇచ్చాయి. 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ఈ రోజు ప్రార్థిస్తున్నారు. గత పదేళ్లలో దేశ అంతర్గత, బాహ్య భద్రతను పటిష్ఠం చేశాం. దీంతో బలమైన భారతదేశాన్ని స్థాపించడంలో మోదీ సర్కార్ విజయవంతమైంది. ప్రాచీన విద్యా విధానం, ఆధునిక విద్యతో కూడిన కొత్త విద్యా విధానాన్ని ప్రధాని మోదీ తీసుకువచ్చారు. ఇది మన ప్రాంతీయ భాషలను కూడా గౌరవిస్తుంది. "
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

'అంతరిక్ష రంగంలో భారత్​కు ఉజ్వల భవిష్యత్'
ప్రపంచంలోనే భారత్ గొప్ప ఉత్పత్తి కేంద్రంగా మారిందని గర్వంగా చెప్పగలనని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచం అంగీకరిస్తోందని వెల్లడించారు. 60 కోట్ల మంది భారతీయులకు ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్, తాగునీరు, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, విద్యుత్, 5 కిలోల ఉచిత రేషన్ అందించామని షా పేర్కొన్నారు. వచ్చేసారి ఎన్నికలకు వెళ్లేటప్పటికీ సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేది తమ లక్ష్యమని చెప్పారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఒక బుక్‌లెట్​ను ఆవిష్కరించారు.

కీలక ప్రాజెక్టులివే!

  • మహారాష్ట్రలోని వాధవన్‌ లో రూ.76,200 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోని 10 అతిపెద్ద పోర్టులో ఒకటిగా నిలవనుంది.
  • ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన- 4 (పీఎంజీఎస్ వై-4) కింద 62,500 కి.మీ.ల మేర రహదారులు, వంతెనల నిర్మాణం, అభివృద్ధికి ఆమోదం తెలిపారు. తద్వారా 25 వేల మారుమూల గ్రామాలు లబ్ధి పొందుతాయి. ఇందులో కేంద్ర సహాయం రూ.49,000 కోట్ల మేర ఉంటుంది.
  • రూ.50,600 కోట్ల పెట్టుబడితో రహదారుల నెట్‌ వర్క్‌ ను బలోపేతం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో 936 కి.మీ.ల మేర విస్తరించి ఉన్న 8 జాతీయ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు ఉన్నాయి
  • కేంద్ర ప్రభుత్వం 'అగ్రిష్యూర్‌' పేరుతో కొత్త నిధిని ప్రారంభించింది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం సహా స్టార్టప్స్, గ్రామీణ సంస్థలకు మద్దతు ఇవ్వడం ఈ నిధి లక్ష్యం.

జమిలీ విధానం అమలు
ఇక ఎన్​డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ విడతలోనే జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ఒక దేశం-ఒక ఎన్నిక ఆవశ్యకతను గట్టిగా చెప్పారు. తరచుగా ఎన్నికలు జరగటం దేశ ప్రగతికి అవరోధంగా మారుతున్నట్లు తెలిపారు.
మరోవైపు, మణిపుర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మైతేయి, కూకీవర్గాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు అమిత్ షా తెలిపారు. మయన్మార్‌ నుంచి చొరబాట్ల నియంత్రణకు సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. జనగణనకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details