తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత అమ్ములపొదిలోకి మరో అద్భుతం- 1000కిమీ రేంజ్​తో యాంటీ షిప్ మిస్సైల్ సిద్ధం!

భారత అమ్ముల పొదిలో త్వరలో చేరనున్న మరో అద్భుత ఆయుధం- 1000 కిలోమీటర్ల యాంటీ షిప్ బాలిస్టిక్ మిస్సైల్​ పరీక్షించనున్న డీఆర్​డీఓ

India Anti Ship Ballistic Missile
India Anti Ship Ballistic Missile (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 1:34 PM IST

Updated : Nov 11, 2024, 2:16 PM IST

India Anti Ship Ballistic Missile :భారత అమ్ముల పొదిలో త్వరలో మరో అద్భుత ఆయుధం చేరనుంది. భారత్ రాకెట్ ఫోర్స్​కు వెన్నుదన్నుగా దీర్ఘశ్రేణి యాంటీ-షిప్ బాలిస్టిక్ మిస్సైల్​ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్​డీఓ) పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తున్న యుద్ధ నౌకలను, విమాన వాహక నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగినట్లు పేర్కొన్నారు.

ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని తీర ప్రాంతం, యుద్ధ నౌకల నుంచి లక్ష్యాలపైకి ప్రయోగించ వచ్చని రక్షణ అధికారులు తెలిపారు. ఈ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని శత్రు నౌకలను నావికాదళం తుదముట్టించగలదని చెప్పారు. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ఈ దీర్ఘశ్రేణి క్షిపణుల రాక మరింత ఇనుమడింపజేస్తోందని వెల్లడించారు. ప్రళయ్‌ వంటి స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్‌ ఆర్మీ, వాయుసేనల పోరటపటిమ మరింత పెరిగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో సముద్రజలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని విశ్లేషించారు. శత్రువుల నుంచి ఎటువంటి భద్రతా సవాళ్లు ఎదురైన వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ ఎప్పటికప్పడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.

India Stealth Fighter Jet AMCA :క్షిపణులే కాకుండా భారత్​, సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్‌ రకం యుద్ధ విమానాలను డీఆర్​డీఓ అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ నమూనాను ఏవియేషన్‌ ఎక్స్‌పో ఐడాక్స్‌ 2024లో డీఆర్​డీఓ ప్రదర్శించింది. 2028 నాటికి దీని ప్రాథమిక వెర్షన్‌ను సిద్ధం చేయాలని చూస్తోంది. గతంలో తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్‌ ఎక్స్‌పో ఐడాక్స్‌ 2024లో ఏఎంసీఏ ఫైటర్‌ జెట్‌ నమూనాను డీఆర్​డీఓ ప్రదర్శించింది. 2035 నాటికి ఇవి భారత్‌ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే, స్టెల్త్‌ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్‌ నిలవనుంది.

Last Updated : Nov 11, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details